ఆందోళనకరంగా ఉన్న డా.రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితి!
దేశవ్యాప్తంగా అన్‌లాక్ ప్రక్రియ కొనసాగుతోంది. చాలా పరిశ్రమలు యధావిధిగా తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి. అయితే కరోనా మాత్రం తన పంజాను విసురుతూనే ఉంది. దేశవ్యాప్తంగా ప్రతిరోజూ వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. కరోనాకు ఎవరూ అతీతులు కాదు. అందర్నీ వణికిస్తోంది. ఇటీవల ఎంతో మంది ప్రముఖులు కరోనా బారిన పడి మృతి చెందారు. అందులో సినీ ప్రముఖులు కూడా చాలా మంది ఉన్నారు. టాలీవుడ్లో ఈమధ్యకాలంలో చాలా మంది ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. చికిత్స అనంతరం కోలుకున్నారు కూడా. ఇటీవల డా.రాజశేఖర్ కుటుంబంలోని అందరికీ కరోనా సోకినట్టు స్వయంగా రాజశేఖర్ ప్రకటించారు. ఆయన కుమార్తెలు చికిత్స తీసుకుని కోలుకున్నారు. రాజశేఖర్, జీవిత మాత్రం ఇంకా హాస్పిటల్లోనే ఉండి చికిత్స తీసుకుంటున్నారు. తాజా సమాచారం మేరకు రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు తెలుస్తోంది. బుధవారం రాత్రి రాజశేఖర్‌కు శ్వాస సంబంధమైన ఇబ్బందులు తలెత్తినట్లు తెలుస్తుంది. ఇన్సెంటివ్ కేర్ యూనిట్లో రాజశేఖర్ చికిత్స పొందుతున్నారు. వైద్యులు తమ శక్తివంచన లేకుండా చికిత్స కొనసాగిస్తున్నారు. రాజశేఖర్ త్వరగా కోలుకుని రావాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.
గత కొన్నేళ్ళుగా సరైన హిట్ లేని రాజశేఖర్‌కు గరుడవేగ రూపంలో భారీ విజయం దక్కింది. హీరోగా మళ్ళీ బిజీ అయి విభిన్నమైన సినిమాలు చేస్తూ ప్రేక్షకుల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. గరుడవేగ తర్వాత కల్కి సినిమా చేశారు. ఆయన నటించిన `అర్జున్` చిత్రాన్ని ఈ సంవత్సరం సమ్మర్లో రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేశారు. కానీ, లాక్డౌన్ కారణంగా ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది. ఇకపై చేయబోయే సినిమాలు కూడా విభిన్నంగా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్న రాజశేఖర్‌కు కరోనా సోకడంతో ఆయన అభిమానులు మనోవేదనకు గురవుతున్నారు.













