Hariteja: ఆయన వల్ల నా జీవితమే మారిపోయింది

ఒక్క ఛాన్స్ జీవితాన్నే మార్చేస్తుందని ఊరికే అనలేదు. ఎవరి జీవితమైనా ఒక్క అవకాశంతో మారిపోవచ్చు. తన జీవితమూ అలానే మారిందని చెప్తోంది అలనాటి సీరియల్ నటి హరితేజ(hari teja). బుల్లితెర తెలుగు ప్రేక్షకులకు హరి తేజ అంటే ఎవరో కొత్తగా చెప్పక్కర్లేదు. ఎన్నో సీరియల్స్, టీవీ షోలతో అలరించిన ఆమె, బిగ్ బాస్ సీజన్1(Bigg Boss season1) లో కనిపించి ఆడియన్స్ కు మరింత చేరువైంది.
ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారి పలు సినిమాలతో బిజీగా ఉన్న హరితేజ, రీసెంట్ గా డైరెక్టర్ త్రివిక్రమ్(trivikram) గురించి మాట్లాడిన మాటలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. తన లైఫ్ పూర్తిగా మారిపోవడానికి, తాను కెరీర్లో బిజీ అవడానికి కారణం త్రివిక్రమేనని హరితేజ చెప్తోంది. అ..ఆ సినిమాలో త్రివిక్రమ్ తనకు ఛాన్స్ ఇవ్వడం వల్లే తనకు సినిమాల్లో ఎక్కువగా అవకాశాలొస్తున్నాయని పేర్కొంది హరితేజ.
అ..ఆ(A..Aa) సినిమాలో పని మనిషి క్యారెక్టర్ కోసం వెతుకుతూ ఓ రోజు త్రివిక్రమ్ టీవీ చూస్తుంటే వంటల ప్రోగ్రామ్ లో తనను చూశారని, తన కామెడీ టైమింగ్, జోకులు నచ్చి ఈ అమ్మాయిని పట్టుకురమ్మని ఆయన తన టీమ్ కు చెప్పారని, ముందు త్రివిక్రమ్ తో సినిమా అనగానే షాకయ్యానని చెప్పింది. తర్వాత ఆ పాత్ర కోసం ఆడిషన్ ఇచ్చానని, ఆడిషన్ ఇచ్చిన వారం తర్వాత కూడా ఏమీ చెప్పకపోవడంతో ఈ సినిమా పోయినట్టే అనుకున్నానని, ఆ తర్వాత ఫోన్ చేసి డైరెక్ట్ గా డేట్స్ అడిగారని, కనీసం తన పాత్ర ఏంటనేది కూడా తెలుసుకోకుండానే తాను అ..ఆ సినిమాకు సైన్ చేసినట్టు హరితేజ వెల్లడించింది.