ఎవరు ఎవరికి లైఫ్ ఇచ్చారు?
తింటున్నంత సేపు విస్తరాకు అంటారు… తిన్న తర్వాత దాన్ని ఎంగిలాకు అంటారు. అవసరం ఉన్నంత వరకే ఎవరైనా వరసలు కలిపి మాట్లాడతారు. అవసరం తీరిన తర్వాత లేనిపోనివి అంటగడతారు… ఇవి నిర్మాత బండ్ల గణేశ్ చేసిన కామెంట్స్. ట్విట్టర్లో గణేష్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. డైరెక్టర్ హరీశ్ శంకర్‌ని ఉద్దేశించి గణేష్ ఈ కామెంట్ చేశారని ప్రచారం జరుగుతోంది.
అసలు విషయం ఏమిటంటే.. పవన్‌కల్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో బండ్ల గణేష్ నిర్మించిన గబ్బర్‌సింగ్ చిత్రం 8 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ ఆనందాన్ని హరీష్ శంకర్ అందరితో పంచుకుంటూ సహకరించిన అందరికీ థాంక్స్ అంటూ పోస్ట్ చేశాడు. అందులో అసిస్టెంట్ డైరెక్టర్ పేరును కూడా మెన్షన్ చేశాడు. కానీ, నిర్మాత బండ్ల గణేష్ పేరు లేదు. తర్వాత మరో పోస్ట్ చేస్తూ నిర్మాత బండ్ల గణేష్ పేరు మర్చిపోయానన్నారు. దానికి గణేష్ స్పందిస్తూ.. అది ఆయన సంస్కారం. రీమేక్‌లు తప్ప స్ట్రెయిట్ సినిమా తియ్యలేడు. ఒక్క సినిమా అలా తీసి హిట్ కొట్టమనండి. నేను ఇండస్ట్రి వదిలేసి వెళ్లిపోతాను. హరీష్‌కు పవన్‌కల్యాణ్‌ను డైరెక్ట్ చేసే అవకాశం కల్పించింది నేను అంటూ పోస్ట్ చేశారు. దానికి హరీష్ స్పందిస్తూ నేను డైరెక్ట్ చేసిన మొదటి సినిమా షాక్ 2006లో రిలీజ్ అయింది. ఆయన నిర్మాతగా చేసిన మొదటి సినిమా ఆంజనేయులు 2009లో రిలీజ్ అయింది. అంటే ఎవరు ఎవరికి లైఫ్ ఇచ్చినట్టు అంటూ జవాబిచ్చారు. దానికి స్పందిస్తూ తాజాగా బండ్ల గణేష్ పైవిధంగా పోస్ట్ చేశారు. మరి ఈ మాటల యుద్ధం ఇంతటితో ఆగుతుందో.. లేక ఇంకా ముందుకు వెళుతుందో చూడాలి.













