హ్యాపీ బర్త్ డే టు నందమూరి బాలకృష్ణ
తెలుగు చలన చిత్రసీమకు ఎన్.టి.ఆర్., ఎ.ఎన్.ఆర్. రెండు కళ్ళలాంటివారు. వారిద్దరి కుమారులు బాలకృష్ణ, నాగార్జున టాలీవుడ్లో టాప్ హీరోలుగా పేరు తెచ్చుకోవడం విశేషమనే చెప్పాలి. బాలకృష్ణ తండ్రికి తగ్గ తనయుడిగా మాస్ క్యారెక్టర్స్‌లో, పవర్ఫుల్ డైలాగ్స్‌తో ప్రేక్షకుల్ని, అభిమానుల్ని ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. కుటుంబ చిత్రాల కథానాయకుడిగా, కమర్షియల్ హీరోగా, తెలుగునాట ఫ్యాక్షన్ సినిమాలకు క్రేజ్‌ను పెంచిన బాక్సాఫీస్ బొనాంజాగా వైవిధ్య మైన పాత్రలు చేయడమే కాకుండా జానపద, పౌరాణిక, చారిత్రాత్మక, భక్తిరస చిత్రాల్లో నటించిన నవరస నటనాయకుడిగా బాలకృష్ణ చూపిన వేరియేషన్స్ ఇంకె వ్వరూ చూపలేదని చెప్పడం అతిశయోక్తి కాదు.
తెలుగు చిత్ర పరిశ్రమలో క్రమశిక్షణ అనే మాట వచ్చినపుడు మొట్ట మొదట చెప్పకునే పేరు ఎన్.టి.రామారావు. ఉదయం 7 గంటలకు కాల్షీట్ ఉంది అంటే 6.59 గంటలకే మేకప్‌తో సెట్లో సిద్ధంగా ఉండేవారు. అలాంటి క్రమశిక్షణను బాలకృష్ణ కూడా అలవరుచుకున్నారు.
1974లో ఎన్.టి.ఆర్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన `తాతమ్మకల` చిత్రంతో నటుడిగా చిత్ర రంగ ప్రవేశం చేశారు బాలకృష్ణ. ఆ తర్వాత తండ్రితో కలిసి ‘అన్నదమ్ముల అనుబంధం, అనురాగదేవత, రౌడీ రాముడు`కొంటెకృష్ణుడు, సింహం నవ్విందిచ దానవీరశూరకర్ణ, తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం, శ్రీమద్విరాట పర్వం, వేములవాడ భీమకవి, అక్బర్ సలీం అనార్కలి చిత్రాల్లో వివిధ క్యారెక్టర్లు చేసి ఎన్.టి.ఆర్. నట వారసుడు బాలకృష్ణే అనిపించుకున్నారు. 1984లో విడుదలైన `సాహసమే జీవితం` చిత్రంతో సోలో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు పి.వాసు తన మిత్రుడు భారతితో కలిసి భారతివాసు పేరుతో `సాహసమే జీవితం` చిత్రానికి దర్శకత్వం వహించారు.
ఆ తర్వాత మంగమ్మగారి మనవడు ముద్దుల క్రిష్ణయ్య, అనసూయమ్మగారి అల్లుడు, మువ్వగోపాలుడు, ఇన్స్పెక్టర్ ప్రతాప్, రక్తాభిషేకం, ముద్దుల మావయ్య, ప్రెసిడెంట్‌గారి అబ్బాయి, నారి నారి నడుమ మురారి, ముద్దుల మేన్లుడు, లారీ డ్రైవర్, తల్లిదండ్రులు, రౌడీ ఇన్స్పెక్టర్, బంగారు బుల్లోడు, నిప్పురవ్వ, బొబ్బిలి సింహం, వంశానికొక్కడు, పెద్దన్నయ్య, సమరసింహారెడ్డి, నరసింహ నాయుడు, లక్ష్మీ నరసింహా, సింహా, లెజెండ్ వంటి సూపర్‌హిట్ సినిమాలతో సంచలనం సృష్టించారు. అలాగే ఆదిత్య 369లో శ్రీకృష్ణ దేవరాయలుగా, కృష్ణార్జున విజయంలో కృష్ణార్జునులుగా, శ్రీరామరాజ్యంలో శ్రీరాముడిగా, పాండురంగడులో శ్రీకృష్ణుడిగా, పుండరీకుడుగా నటించి ప్రేక్షకులను మెప్పిం చారు. అలాగే తండ్రి యన్‌టిఆర్‌తో పాతాళభైరవి చిత్రాన్ని చేసిన విజయా బ్యానర్లో భైరవద్వీపం వంటి జానపద చిత్రంలో నటించి ఎదురులేని జానపద నాయకుడిగా అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్నారు. తన 100వ చిత్రంగా గౌతమీపుత్ర శాతకర్ణి చేసి తెలుగు సినిమా రంగంలో సరికొత్త చరిత్ర సృష్టించారు. మరే స్టార్ హీరో చేయనంత ఫాస్ట్‌గా వరుస సినిమాలు చేస్తూ అందరినీ ఆశ్చర్య పరుస్తున్నారు. సాంఘికం, పౌరాణికం, భక్తిరసం, జానపదం, సోషియో ఫాంటసీ, చారిత్రాత్మకం ఇలా అన్ని జోనర్ చిత్రాల్లోనూ అవలీలగా నటించి ఘనవిజయాలు సాధించే సత్తా నటసింహ బాలకృష్ణలో ఉందని పలుమార్లు నిరూపించారు.
సినిమాల్లో ద్విపాత్రాభినయం చేయడం ఎంతో కష్టమైన విషయం. అలాగే మూడు పాత్రల్లో నటించాలంటే ఎంతో కష్టపడాలి. అయితే అగ్ర కథానాయకుల్లో 15 చిత్రాల్లో ద్విపాత్రాభినయం చేసిన క్రెడిట్ బాలకృష్ణకే దక్కుతుంది. అలాగే అధినాయకుడు చిత్రంలో తాత, తండ్రి, కొడుకు పాత్రల్లో నటించి ఆకట్టుకున్నారు.
2014లో విడుదలైన లెజెండ్‌తో మరో లెజెండ్రీ హిట్ కొట్టడమే కాకుండా 2014 ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి హిందూపురం నియోజకవర్గం నుండి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు బాలకృష్ణ. అలాగే 2019లో రెండోసారి ఎమ్మెల్యేగా ఘనవిజయం సాధించి ప్రజా సేవ చేస్తున్నారు. ఇటు సినిమాలతో కథానాయకుడిగా, అటు రాజకీయాలతో ప్రజానాయకుడిగా తనదైన శైలిలో ముందడుగు వేస్తున్నారు నందమూరి నాయకుడు.
నందమూరి బాలకృష్ణను ఫెరోషియస్‌గా ఓ కొత్త కోణంగా ఆవిష్కరించిన దర్శకుడు బోయపాటి శ్రీను. సింహా, లెజెండ్ చిత్రాల్లో బాలకృష్ణ పోషించిన పాత్రలు ఆయన కెరీర్లో మైల్స్టోన్స్గా నిలిచిపోతాయి. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లో ఓ హాట్రిక్ మూవీ సిద్ధమవుతోంది. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తోన్న ఈ చిత్రం ఇప్పటికే ఓ షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి చేసుకుంది. తెలంగాణ ప్రభుత్వం సినిమా షూటింగులకు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో త్వరలోనే ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి విడుదలైన ఫస్ట్‌లుక్‌కి, టీజర్‌కి చాలా మంచి స్పందన వస్తోంది.
అటు సినిమాలతోనూ, ఇటు రాజకీయాలతోనూ తనదైన ముద్ర వేస్తున్న నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు జూన్ 10. ఈ సందర్భంగా ఆయన అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. నటుడిగా, రాజకీయ వేత్తగా మరింత రాణించాలని కోరుకుంటూ నందమూరి బాలకృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తోంది ‘తెలుగు టైమ్స్’.













