సీతారామం సీక్వెల్ ఆలోచనల్లో హను
హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా వైజయంతీ మూవీస్ బ్యానర్ లో వచ్చిన సీతారామం సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాలో రష్మిక మందన్నా కీలక పాత్రలో మెప్పించింది. అప్పటివరకు బాలీవుడ్ లో సినిమాలు చేస్తున్నా తగిన గుర్తింపు దక్కని మృణాల్ కు సీతారామం సినిమా ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ క్రేజ్ ను తెచ్చిపెట్టింది.
సీతారామం మూవీ చేసిన మ్యాజిక్ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయింది. ఆ సినిమా చివర్లో రామ్ కోసం సీత ఎదురుచూస్తుండగా అక్కడితో కథ పూర్తవుతుంది. ఆ పాత్రలకు ఆడియన్స్ కూడా బాగా ఎంగేజ్ అయ్యారు. ఆ కథను కొనసాగిస్తే బాగుంటుందని సీతారామం చూసిన ప్రతీ ఒక్కరూ భావిస్తున్నారు. హను రాఘవపూడి కూడా ఈ విషయంలో ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ప్రభాస్ తో సినిమాకు రెడీ అవుతున్న హను, ఆ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాలంటే ఎంతలేదన్నా 2025 చివర వరకు ఆగాలి. ఈ లోగా సీతారామం2 స్క్రిప్ట్ ను రెడీ చేయాలని చూస్తున్నాడు హను. వాస్తవానికి సీతారామం సినిమాలోనే ఆ పాత్రలు పూర్తయ్యాయి. కానీ ఆడియన్స్ ఆ పాత్రలను అంతగా మర్చిపోలేకపోతున్నారు కాబట్టి వారిని మరో కొత్త కథలో భాగం చేసేలా హను ప్లాన్ చేస్తున్నాడట. అంటే మరోసారి దుల్కర్, మృణాల్ కలిసి స్క్రీన్ ను షేర్ చేసుకునే ఛాన్సుందన్నమాట. సీతారామం సినిమాకు పని చేసిన చిత్ర బృందమే ఈ సినిమాకు కూడా పని చేసే ఛాన్సుంది.













