వరసగా ఓటీటీలో రిలీజ్‌కి సిద్ధమవుతున్న సత్యదేవ్ సినిమాలు!
ఎన్నో ఏళ్ళుగా విడుదలకు నోచుకోని సినిమాలకు ఓ వరంలా కనిపిస్తోంది ఓటీటీ ప్లాట్‌ఫామ్. అయితే అది అన్ని సినిమాలకు వర్తించదు. ఆయా సినిమాల్లో నటించిన హీరోని బట్టి ఓటీటీ సంస్థలు ఆ సినిమాలను విడుదల చేసేందుకు ముందుకొస్తున్నాయి. ఇప్పుడు సత్యదేవ్ చేసిన ఓ సినిమా ఓటీటీలో దర్శనమివ్వబోతోంది. ఇప్పటికే సత్యదేవ్ హీరోగా నటించిన మూడు సినిమాలు ఓటీటీలో రిలీజ్ అయ్యాయి. తాజాగా అతను హీరోగా నటించిన గువ్వగోరింక అనే సినిమా నవంబర్ 17న అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కాబోతోంది. సహాయ నటుడిగా కెరీర్‌ని ప్రారంభించిన సత్యదేవ్ జ్యోతిలక్ష్మి చిత్రంతో హీరోగా మారాడు. ఆ సమయంలోనే ప్రారంభమైన గువ్వ గోరింక సినిమాకి ఇప్పుడు ఓటీటీ ద్వారా మోక్షం లభించబోతోంది. రామ్‌గోపాల్‌వర్మ శిష్యుడు మోహన్ బొమ్మిడిని దర్శకుడిగా పరిచయం చేస్తూ దాము కొసనం, జీవన్‌రెడ్డి నిర్మించిన ఈ సినిమా కొన్ని కారణాల వల్ల విడుదలకు నోచుకోలేదు. ఇప్పుడు సత్యదేవ్ హీరోగా మంచి ఫామ్‌లో ఉన్నాడు. డిఫరెంట్ కాన్సెప్ట్స్‌తో చేసిన సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు.
ఈ నేపథ్యంలో అతని కెరీర్ ప్రారంభంలో చేసిన గువ్వగోరింక చిత్రాన్ని ఓటీటీ ద్వారా రిలీజ్ చేసేందుకు నిర్మాతలు దాము, జీవన్‌రెడ్డి నిర్ణయించుకున్నారు. ఈ మేరకు అమెజాన్ ప్రైమ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. మినిమం గ్యారెంటీ ఉన్న సినిమాలను మాత్రమే తమ సంస్థ ద్వారా విడుదల చేసే అమెజాన్ సంస్థ ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు సిద్ధమైంది. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ సినిమాలో చైతన్య, మధుమిత, ప్రియదర్శి, ఈటీవీ ప్రభాకర్, ఫిష్ వెంకట్, సత్యప్రియ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకుల ఆదరణ పొందుతుందన్న కాన్ఫిడెన్స్‌తో ఉన్నారు నిర్మాతలు. ఈ సినిమాతోపాటు సత్యదేవ్ నటించిన మరో రెండు సినిమాలు కూడా ఓటీటీ ద్వారానే రిలీజ్ కాబోతున్నాయని సమాచారం. అయితే ఆ రెండు సినిమాలు ఏమిటి అనేది త్వరలోనే తెలుస్తుంది. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ సినిమాలను ఓటీటీ ద్వారా రిలీజ్ చేస్తేనే జనంలోకి వెళ్తాయని ఆయా సినిమాల దర్శకనిర్మాతలు భావిస్తున్నారట.













