తమ ప్రేమపై వస్తున్న వార్తలకు తెరదించి ఎంగేజ్మెంట్తో సమాధానమిచ్చిన విష్ణు విశాల్, గుత్తా జ్వాల!
బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల, తమిళ్ హీరో విష్ణువిశాల్ గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. త్వరలోనే వీరిద్దరూ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈరోజు(సెప్టెంబర్ 7) గుత్తా జ్వాల పుట్టినరోజున వీరిద్దరి నిశ్చితార్థం జరిగింది. ఈ సందర్భంగా విష్ణు విశాల్ తనకు కాబోయే భార్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్ చేశాడు. “హ్యాపీ బర్త్‌డే గుత్తా జ్వాల. ఒక కొత్త జీవితానికి ఇది ఆరంభం. ఒక మంచి భవిష్యత్తు కోసం మనం పాజిటివ్‌గా ఉంది. మమ్మల్ని సపోర్ట్ చేసిన బంధు మిత్రులకు థాంక్స్. అర్థరాత్రి అని కూడా చూడకుండా నాకు ఎంగేజ్మెంట్ రింగ్ తెచ్చి ఇచ్చిన గుత్తా జ్వాల మేనేజర్ బసంత్ జైన్‌కు థాంక్స్“ అని ట్వీట్ చేశాడు విష్ణు విశాల్.
ఇకపోతే వీరిద్దరికీ ఇది రెండో వివాహమే కావడం విశేషం. గుత్తా జ్వాల 2005లో తోటి బ్యాడ్మింటన్ ప్లేయర్ చేతన్ ఆనంద్‌ను వివాహం చేసుకుంది. ఆ తర్వాత వారిద్దరి మధ్య వచ్చిన మనస్ఫర్థల కారణంగా 2011లో విడాకులు తీసుకున్నారు. ఇక విష్ణువిశాల్ వివాహం రజనీనటరాజ్తో 2010లో జరిగింది. వీరి వైవాహిక జీవితం 8 ఏళ్ళు మాత్రమే కొనసాగింది. 2018లో వీరు విడాకులు తీసుకున్నారు. ఇప్పుడు గుత్తా జ్వాల, విష్ణువిశాల్ వివాహబంధంతో ఒక్కటవ్వాలని నిర్ణయించుకున్నారు. వీరు కొంతకాలంగా ప్రేమలో ఉన్నారని మీడియాలో వార్తలు వచ్చినప్పటికీ ఇద్దరిలో ఎవ్వరూ వాటిని ఖండించలేదు. ఆ వార్తలకు తెరదించేందుకు నిశ్చితార్థం చేసుకొని పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించారు.













