Kandula Durgesh: సినీ పరిశ్రమ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది! – మంత్రి కందుల దుర్గేష్

జూన్ 1 నుండి థియేటర్లు మూసివేయాలన్న ఎగ్జిబిటర్లు, డిస్టిబ్యూటర్ల నిర్ణయంపై ఆరా తీస్తున్నామని వెల్లడి.!
హోం శాఖ సెక్రటరీతో విచారణ చేపట్టాలని నిర్ణయించామన్న మంత్రి దుర్గేష్.!
విచారణ అనంతరం వచ్చే వివరాలపై చర్చించి సినీ పరిశ్రమకు ఉపయోగపడే విధంగా నిర్ణయాలు తీసుకుంటామన్న మంత్రి దుర్గేష్.!
సినీ రంగ పరిశ్రమకు, ప్రభుత్వానికి మధ్య అనుకూల వాతావరణం ఉందని స్పష్టం.!
హరిహరవీరమల్లు సినిమా విడుదలకు ముందు ఈ తరహా వ్యవహారం దేనికి సంకేతమని ప్రశ్నించిన మంత్రి దుర్గేష్.!
సినీ పరిశ్రమ అభివృద్ధి కోసమే నూతన ఫిల్మ్ పాలసీ తెస్తున్నట్లు తెలిపిన మంత్రి దుర్గేష్.!
ఇప్పటికే సినీ పరిశ్రమ దోహదం కోసం టికెట్ల రేట్ల పెంపు, త్వరితగతిన షూటింగ్ లకు అనుమతులు జారీ చేస్తున్నట్లు వివరించిన మంత్రి దుర్గేష్.!
చిత్ర పరిశ్రమకు, ఎగ్జిబిటర్లకు, డిస్టిబ్యూటర్లకు ప్రొడ్యూసర్లకు ఉపయోగపడే విధంగా నిర్ణయాలు తీసుకునేందుకే హోం శాఖ ముఖ్య కార్యదర్శి నేతృత్వంలో విచారణ చేపడుతున్నామని మంత్రి కందుల దుర్గేష్ (Kandula Durgesh) స్పష్టం చేశారు. శనివారం రాజమహేంద్రవరంలోని హుకుంపేటలో ఉన్న తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడారు. ఈ సందర్భంగా సినీ పరిశ్రమకు కూటమి ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని వివరించారు.సినీ పరిశ్రమకు పూర్తి సహకారం అందించే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు.
జూన్ 1వ తేదీ నుండి సినిమా థియేటర్ల బంద్ చేయబోతున్నారన్న విషయం కొన్ని రోజులుగా ప్రచారంలోకి వచ్చిందని, ఈ క్రమంలో ఎందుకు ఈ వాతావరణం తెరపైకి వచ్చిందని, దీనికి ప్రోద్భలం అందిస్తున్న వ్యక్తులెవరు, జరుగుతున్నదేమిటి తదితర అంశాలన్నింటిపై విచారణ జరిగితే చిత్ర పరిశ్రమకు ఉపయోగపడే విధానాలను అవలంబించేందుకు వీలుగా ఉంటుందన్న ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నామన్నారు. ఈ విషయం తెలియగానే హోం శాఖ సెక్రటరీ కుమార్ విశ్వజిత్ తో చర్చించానన్నారు. ఈ అంశంపై లోతుగా విచారణ చేయాలని ఆదేశించానన్నారు. తద్వారా అసలు విషయం వెలుగులోకి వస్తుందని అనంతరం తమ చర్యలుంటాయన్నారు.!
ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం అన్ని అంశాలను పరిశీలించి, లోతుగా అధ్యయనం చేసి సినీ పరిశ్రమకు సహకారం అందించాలని నిర్ణయించిందన్నారు. ప్రభుత్వం ఏర్పాటు అయిన వెంటనే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సినీ పరిశ్రమకు చెందిన వారితో ప్రత్యేక సమావేశం నిర్వహించి సమస్యలను ఆరా తీసి పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని భరోసానిచ్చిన విషయం గుర్తుచేశారు. గతంలో మాదిరి కాకుండా సినీ పరిశ్రమను తాము గౌరవిస్తామని డిప్యూటీ సీఎం తెలిపారని మంత్రి అన్నారు.సినీ పరిశ్రమకు చెందిన ఏ సమస్య అయినా సినిమాటోగ్రఫీ మంత్రిగా తనతో మాట్లాడాలని సినీ పెద్దలకు డిప్యూటీ సీఎం నాడు సూచించినట్లు మంత్రి దుర్గేష్ తెలిపారు.ఇప్పటివరకు సినీ పరిశ్రమకు, ప్రభుత్వానికి మధ్య అనుకూల వాతావరణం ఉన్నప్పటికీ ఆకస్మాత్తుగా థియేటర్ల బంద్ అనే అంశం తెరపైకి ఎందుకు వచ్చిందో అర్థం కావడం లేదన్నారు. దీని వెనుక ఉన్న కారణాలను ఆరా తీస్తున్నామన్నారు.
జూన్ 12వ తేదీన సినీ నటులు పవన్ కళ్యాణ్ హరిహరవీరమల్లు చిత్రం విడుదలవుతున్న సందర్భంలో ఈ రకమైన వాతావరణం ఎందుకు వచ్చిందో తెలియడం లేదన్నారు. ఇది ఎంత మాత్రం సరికాదన్నారు. థియేటర్ల మూసివేత అనే అంశంలో ఎవరితోనైనా చర్చించి నిర్ణయం తీసుకున్నారా అని ఈ సందర్భంగా ప్రశ్నించారు. ఆకస్మాత్తుగా థియేటర్లను మూసివేస్తామని నిర్ణయం తీసుకోవడానికి దోహద పడిన కారణాలేంటని అడిగారు. ఈ అంశాలన్ని తెలుసుకునేందుకే పూర్తిస్థాయి విచారణ చేస్తున్నామని, తద్వారా వాస్తవాలు వెలుగులోకి వస్తాయని మంత్రి కందుల దుర్గేష్ స్పష్టతనిచ్చారు. అంతేగాక సినిమాలకు సంబంధించి టికెట్ల రేట్ల పెంపు విషయంలో దరఖాస్తు చేసుకున్న వెంటనే ఏ నిర్మాత ఇబ్బంది పడకుండా తాము వెంటనే ఆమోదించి ఆయా స్థాయిల్లో టికెట్ల రేట్లు పెంచుతున్నామని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు. సినిమా నిర్మాణం సమయంలో అనుమతులు త్వరితగతిన జారీ చేస్తున్నామన్నారు. ఎప్పటికప్పుడు సినీ నిర్మాతలతో మాట్లాడుతూనే ఉన్నామన్నారు.
సినీ పరిశ్రమను ఆదుకోవడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని భరోసానిచ్చారు. కలిసి ముందుకు వెళ్లడం కోసమే నూతన ఫిల్మ్ పాలసీ తెస్తున్నామన్నారు. ప్రతి సారి దరఖాస్తు చేసుకునే పరిస్థితికి చెక్ పెడుతూ పాలసీ రూపకల్పన జరుగుతుందన్నారు. ప్రతి సినిమాకు విడివిడిగా అనుమతులు అడిగే పరిస్థితి రాకూడదని పలు నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందన్నారు. చిత్రపరిశ్రమకు దోహదం చేసేందుకు తామున్నామని వివరించారు. ఈ క్రమంలో థియేటర్లు మూసివేసే పరిస్థితి ఎందుకు వస్తుందన్నారు. విచారణ అనంతరం బయటికి వచ్చే అంశాలను ప్రాతిపదికన తీసుకొని నిర్ణయాలు తీసుకుంటామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు కందుల దుర్గేష్ స్పష్టం చేశారు.!