గోపీచంద్ కొత్త చిత్రం ప్రారంభం
గోపిచంద్ కథానాయకుడిగా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. బిను సుబ్రమణ్యం దర్శకుడిగా పరిచయమవుతున్నారు. బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మాత. సాహసగాథగా రూపొందుతున్న ఈ చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. నిర్మాత మాట్లాడుతూ గోపీచంద్‌తో సాహసం తర్వాత మేం నిర్మిస్తున్న చిత్రమిది. అగ్ర దర్శకులు సంతోష్ శివన్, జయం రాజా వద్ద సహాయ దర్శకుడిగా పనిచేసిన బిను సుబ్రమణ్యం చెప్పిన కథ బాగుంది. సాహసం ఎంత ఆసక్తికరంగా, సాహసోపేతంగా సాగుతుందో, ఈ సినిమా దాన్ని మించి ఉంటుంది. జూన్ నుంచి రెగ్యులర్ చిత్రీకరణ మొదలవుతుంది. కథానాయిక, సాంకేతిక బృందం వివరాల్ని త్వరలోనే వెల్లడిస్తామన్నారు. సతీష్.కె కెమెరా బాధ్యతల్ని నిర్వర్తించబోతున్నారు.













