అదే నిజమైతే గోపీచంద్‌కు ఇక ప్రతిరోజూ పండగేనా?
హీరో గోపీచంద్ 20 ఏళ్ళ కెరీర్లో పాతికకు పైగా సినిమాలు చేశాడు. అందులో విలన్‌గా నటించిన మూడు సినిమాలు మినహాయిస్తే హీరోగా నటించిన సినిమాలు పాతిక ఉంటాయి. ఈ పాతిక సినిమాలను గమనిస్తే సక్సెస్ శాతం చాలా తక్కువ. అయితే విభిన్నమైన కథాంశాలతో, కొత్త కాన్సెప్ట్స్‌తో చేసిన సినిమాలు ఎక్కువ. తన సినిమాల్లో ఏదో ఒక కొత్తదనం ఉండాలని కోరుకునే గోపీచంద్‌కి గత కొంతకాలంగా సరైన సక్సెస్ లేదు. ఒక్కమాటలో చెప్పాలంటే లౌక్యం తర్వాత సరైన కమర్షియల్ హిట్ లేదు. అయినా తన ప్రయత్నం తాను చేస్తూనే ఉన్నాడు. గత ఏడాది విడుదలైన చాణక్య చిత్రంపై గోపీచంద్ ఎన్నో హోప్స్ పెట్టుకున్నాడు. కానీ, ఆ సినిమా కూడా గోపీచంద్‌కి నిరాశే మిగిల్చింది. ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో `సీటీమార్` అనే సినిమాలో నటిస్తున్నాడు. క్రీడా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో గోపీచంద్ కబడ్డీ కోచ్‌గా నటిస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన తర్వాత తేజ దర్శకత్వంలో ఓ సినిమా చెయ్యబోతున్నాడని ఆమధ్య వార్తలు వచ్చాయి.
గోపీచంద్ కెరీర్ ప్రారంభంలో తేజ దర్శకత్వంలో వచ్చిన జయం, నిజం చిత్రాల్లో విలన్‌గా నటించి మెప్పించాడు. మళ్లీ ఇంతకాలానికి తేజ దర్శకత్వంలో అదీ హీరోగా నటిస్తున్నాడని తెలుస్తోంది. అలివేలు మంగ వెంకటరమణ పేరుతో రూపొందే ఈ సినిమాలో గోపీచంద్ సరసన నటించే హీరోయిన్ కోసం అన్వేషణ కొనసాగుతోంది. ఇదిలా ఉంటే మరో మంచి అవకాశం గోపీచంద్ తలుపు తట్టింది. ఇటీవల ప్రతిరోజూ పండగే చిత్రంతో సూపర్‌హిట్ అందుకున్న దర్శకుడు మారుతి కాంబినేషన్లో గోపీచంద్ సినిమా చెయ్యబోతున్నాడట. ప్రతిరోజూ పండగే తర్వాత అల్లు అర్జున్‌తో సినిమా చేస్తాడని వార్తలు వచ్చాయి. అయితే అందులో ఎంతమాత్రం నిజం లేదని తెలుస్తోంది. ఇటీవల గోపీచంద్‌కి మారుతి కథ వినిపించడం, గోపీచంద్ ఓకే చెయ్యడం కూడా జరిగిపోయిందట. ఇదే నిజమైతే గోపీచంద్ కెరీర్‌కి పండగ వాతావరణం వచ్చినట్టే. ఎందుకంటే భలే భలే మగాడివోయ్, మహానుభావుడు, ప్రతిరోజూ పండగే వంటి చక్కని ఫ్యామిలీ ఎంటర్టైనర్స్తో విజయాలు అందుకుంటున్న మారుతి… గోపీచంద్‌కి కూడా ఒక మెమరబుల్ హిట్ ఇస్తాడనుకోవడంలో తప్పు లేదుగా!













