రివ్యూ : చిన్న బడ్జెట్ లో గొప్పగా మెప్పించిన టాలీవుడ్ ‘గూఢచారి’

తెలుగుటైమ్స్ రేటింగ్ : 3.25/5
బ్యానర్ : అభిషేక్ పిక్చర్స్
నటి నటులు : అడవి శేష్, శోభిత ధూళిపాళ్ల, ప్రకాష్ రాజ్, వెన్నెల కిషోర్, సుప్రియ యార్లగడ్డ,
మధు షాలిని, రవి ప్రకాష్, రాకేష్ వర్రే, అనీష్ కురువిళ్ళ తది తరులు నటించారు.
సంగీతం: శ్రీ చరణ్ పాకల, సినిమాటోగ్రఫీ: శనేయిల్ దెవొ
ఎడిటర్ : గారి బి హెచ్, మాటలు : అబ్బూరి రవి
కథ, స్క్రీన్ ప్లే: అడివి శేష్
నిర్మాతలు : అభిషేక్ నామా, టీజీ విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్
దర్శకత్వం : శశి కిరణ్ టిక్కా
విడుదల తేదీ: 03.08.2018
ఊహించని మలుపులతో సరికొత్త కాన్సెప్ట్ తో వచ్చిన ‘క్షణం’ చిత్రం విజయవంతం కావడంతో సక్సెస్ కి ఓ మంచి లైన్ ఒడిసిపట్టుకున్న అడివి శేష్ హీరోగా శోభిత దూళిపాళ్ల హీరోయిన్లుగా నూతన దర్శకుడు శశి కిరణ్ టిక్క దర్శకత్వంలో తెరకెక్కిన్న చిత్రం’ గూఢచారి’. అభిషేక్ పిక్చర్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్ పై అభిషేక్ నామా, టీజీ విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ కలిసి నిర్మించిన ఈ చిత్రం ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం, ఆడియన్స్ ను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !
కథ:
త్రినేత్ర అనేది ఓ ఇంటిలిజెన్స్ ఏజెన్సి. దేశం లోపల, బయట ఉన్న తీవ్రవాదుల్ని ఏరేస్తుంటుంది. ఓ సందర్భం లో వాటికి సంబంధించిన సమస్త సమాచారం ఉగ్రవాదుల చేతికి చిక్కుతుంది. దాంతో త్రినేత్ర ఆపరేషన్ తాత్కాలికంగా పక్కన పెట్టేస్తారు. గోపి (అడవిశేష్) తండ్రి త్రినేత్ర ఏజెంట్, ఓ ఆపరేషన్ లో ఉగ్రవాదుల చేతిలో చనిపోతాడు. దాంతో ఎప్పటికైనా నాన్నలా సీక్రెట్ ఏజెంట్ కావాలని తపిస్తుంటాడు గోపీ. చివరికి ఆ స్థానం కూడా దక్కుతుంది. దాంతో గోపీకి టెర్రరిస్టుల వల్ల ఎలాంటి ప్రమాదం జరగకూడదని గోపీ మామయ్య సత్య (ప్రకాష్ రాజ్ ) గోపీ పేరును అరుణ్ కుమార్ గా మార్చి త్రినేత్ర కి దూరంగా పెంచుతాడు.
ఈ క్రమంలో సమీరా (హీరోయిన్ శోభిత) గోపీ లైఫ్ లోకి వస్తోంది అయితే.. అనుకుండా.. తనపై తీవ్రవాది అనే ముద్ర పడుతుంది. ఏ సంస్థ కోసం అయితే పనిచేస్తున్నాడో, అదే సంస్థ.. తనని వెదుకుతుంటుంది. ఈ పోరాటంలో గెలిచిందెవరు? అసలు గోపిపై తీవ్రవాది అనే ముద్ర ఎందుకు పడింది? ఎలా? అనేది మిగతా కథ తెరపై చూడాల్సిందే.
నటి నటుల పెర్ఫార్మన్స్ :
ఈ చిత్రానికి కథ మరియు స్క్రీన్ ప్లే రచయితగానే కాకుండా హీరోగా కూడా నటించిన అడివి శేష్ తన గత సినిమాల్లో కంటే ఈ సినిమాలో కొత్త లుక్స్ తో చాలా స్టైలిష్ గా ఫ్రెష్ గా కనిపించాడు. ఇటు హీరోయిన్ తో ప్రేమ సన్నివేశాల్లో గాని, అటు యాక్షన్ సన్నివేశాల్లో గాని అడివి శేష్ సెటిల్డ్ గా చాల చక్కగా నటించాడు. అడవిశేష్ క్షణం చిత్రం తో ఆకట్టుకున్నాడు. మళ్లీ అలాంటి థ్రిల్లర్‌నే ఎంచుకోవడం వల్ల తన పని సులభం అయ్యింది. ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించిన మిస్ ఇండియా, తెలుగమ్మాయి అయిన శోభిత ధూళిపాళ హీరోయిన్ మెటీరియల్ కాకపోయినా తన నటనతో ఆకట్టుకుంది. కొన్ని చోట్ల సందర్భానుసారంగా ఆమె పలికించిన హావభావాలు ఆమె నటన మెచ్చుకోదగినది. ఈ చిత్రానికి మరో ప్రధానాకర్షణ సుప్రియా యార్లగడ్డ, త్రినేత్ర అనే సీక్రెట్ ఏజెన్సీకి పని చేసే మిస్టీరియస్ ఏజెంట్ అయినా నదియా ఖురేషీ పాత్రలో కనిపించిన ఆమె తన నటనతో మెప్పించే ప్రయత్నం చేశారు. జగపతిబాబు సర్‌ప్రైజ్ ఎలిమెంట్స్.. ఇక ఎప్పటిలాగే వెన్నెల కిషోర్ తన కామెడీ టైమింగ్ తో నవ్వించగా, ఇతర ముఖ్యమైన పాత్రల్లో కనిపించిన ప్రకాష్ రాజ్, అనిష్ కురువిల్ల, మధు శాలిని కూడా తమ నటనతో ఆకట్టుకున్నారు.
సాంకేతిక వర్గం:
స్క్రీన్ ప్లే ఈ చిత్రానికి ప్రధానబలం. రాసుకున్న మలుపులు.. కలిసొచ్చాయి. చాలా వరకూ.. గ్రిప్పింగ్‌గానే నడిచింది. ‘జేమ్స్ బాండ్ స్టైల్లో ఉంది’ అని కథానాయకుడు అంటే.. `కాస్త బడ్జెట్ తక్కువ` అని వెన్నెల కిషోర్ ఓ డైలాగ్ చెప్పాడు. ఈ సినిమాకీ అది వర్తిస్తుంది. తక్కువ బడ్జెట్‌లోనూ జేమ్స్ బాండ్ సినిమాని తీద్దామనుకున్నారు. ఆ ప్రయత్నం సఫలీకృతమైంది. సినిమాకు పనిచేసిన విఎఫ్ఎక్స్ టీమ్ పని తనం బాగుంది. సన్నివేశాలకు అనుగుణంగా విఎఫ్ఎక్స్ వర్క్ ను వాడుకున్న విధానం ఆకట్టుకుంది. ఇదే కథని ఇంకా మంచి బడ్జెట్, స్టార్లు ఇచ్చుంటే తప్పకుండా మరోస్థాయిలో ఉండేది.సంగీత దర్శకుడు శ్రీ చరణ్ పాకాల అందించిన సంగీతం వినసొంపుగా ఉంది. కొన్ని పాటలు బాగా ఆకట్టుకోగా ఆయన అందించిన నేపధ్య సంగీతం సినిమాకే హైలెట్ గా నిలుస్తోంది. శనీల్ డియో సినిమాటోగ్రఫీ కూడా మెచ్చుకోదగినది. ఎక్కువ లొకేషన్స్ లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఎక్కడా బ్యూటీ తగ్గకుండా తీర్చి దిద్దారు అయన. బి.హెచ్ ఎడిటింగ్ బాగున్నప్పటికీ కథకు అత్యవసరం కాని కొన్ని సీన్స్ విషయంలో ఆయన తన కత్తెరకు ఇంకా పని చెప్పి ఉండాల్సింది. నిర్మాతలు అభిషేక్ నామ, టి.జి.విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. అడవి శేష్ ఆలోచనను నమ్మి డబ్బు పెట్టిన నిర్మాతలను ఈ సందర్భంగా అభినందించాలి.
విశ్లేషణ :
‘క్షణం’, ‘అమీతుమీ’ లాంటి చిత్రాలతో హీరోగా తనకంటూ ఓ గుర్తింపును సంపాదించుకున్న అడివి శేష్ ఈ సారి గూఢచారిగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.మంచి అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకుల్లకు కొత్త అనుభూతిని ఇవ్వడంలో చాలా వరకు సఫలమైంది. హాలీవుడ్ సినిమాలు చూసేవాళ్లకి జేమ్స్ బాండ్ ఫార్మెట్ తెలియంది కాదు. జేమ్స్ బాండ్‌కి ఓ మిషన్ ఉంటుంది. దాన్ని పూర్తి చేసి, తన దేశాన్ని ఎలా కాపాడన్నదే బాండ్ ఫార్ములా కథలు. అయితే గూఢచారి దానికి కొంచెం దగ్గరగా, కొంచెం దూరంగా ఉంటుంది. గూఢచారి కావాలనుకున్న ఓ యువకుడు, ఉగ్రవాదుల ఉచ్చులో ఎలా చిక్కాడు? అందులోంచి ఎలా బయటకు వచ్చాడు? అనేదాని చుట్టూ తిరుగుతూ, దేశభక్తి ని కాస్త, సెంటిమెంట్‌ని కాస్త మేళవిస్తూ థ్రిల్లర్‌లా సాగింది.
తొలి సగంలో `గూఢచారి` అవ్వడం ఎలా అనే విషయంపై ఫోకస్ పెట్టిన దర్శకుడు… ఆయా సన్నివేశాల్ని ఉత్కంఠభరితంగా తీర్చిదిద్దడంలో సఫలీకృతమయ్యాడు. ఓ రకంగా ఇది తెలివైన ఎత్తుగడ. అడవిశేష్ లాంటి ఏ ఇమేజ్ లేని నటుడ్ని నేరుగా జేమ్స్ బాండ్ స్థాయి పాత్రలో చూపిస్తే.. జనం అంగీకరించడం కష్టం. కాబట్టి అందుకే… గూఢచారి అవ్వడానికి చేసే ప్రయత్నాలతో కథ మొదలెట్టి, తాను గూఢచారి అయ్యేసరికి… ప్రేక్షకులు కూడా అంగీకరించేలా చేయగలిగాడు. మధ్యలో హీరో హీరోయిన్ల ప్రేమకథ చూపించి దర్శకుడేమైనా కాస్త దారి తప్పుతున్నాడేమో అనిపిస్తుంది. అయితే ఆ ప్రేమకథని కూడా మిషన్‌లో భాగంగా వాడుకోవడంతో ఒకే అనుకోవడం అవుతుంది.
విశ్రాంతికి ముందొచ్చే సన్నివేశాలు, వేసిన చిక్కుముడులు బాగున్నాయి. దాంతో ఓ మంచి థ్రిల్లర్ చూడబోతున్నామన్న సంతృప్తికి వచ్చేస్తాడు ప్రేక్షకుడు. ఇక సెకండాఫ్‌లో ప్రేక్షకుల్ని థియేటర్లో కూర్చోబెట్టడమే మిగిలింది. అయితే.. ప్రధమార్థంలో కనిపించిన బిగి.. ద్వితీయార్థం మొదలయ్యేసరికి కాస్త సడలుతుంది. అటు పోలీసుల నుంచీ, ఇటు త్రినేత్ర నుంచి తప్పించుకోవడానికి చేసిన ప్రయత్నాలు ఇంకాస్త థ్రిల్లింగ్ గా చూపిస్తే బాగుండేది. జగపతిబాబు పాత్రని ప్రమోషన్లలో ఎక్కడా వాడకుండా జగ్రత్తపడ్డారు. అది కాస్త సర్‌ప్రైజింగ్ ఎలిమెంట్‌గా మారింది. పతాక సన్నివేశాల్లో ట్విస్టుకి ఆ పాత్ర ఉపయోగపడింది. తొలి సగంలో కొన్ని చిక్కుముడుల్ని వేసిన దర్శకుడు వాటిని కొన్నే విప్పగలిగాడు. థియేటర్ నుంచి బయటకు వస్తున్న ప్రేక్షకుడుని ఫుల్ సాటిస్ఫాయ్ చేయగలిగారు.
తీర్పు:
జేమ్స్ బాండ్ తరహా కథలు మనమూ తీయొచ్చని అప్పుడెప్పుడో సూపర్ స్టార్ కృష్ణ నిరూపించారు. అయితే.. ఆ తరవాత ఎవ్వరూ ఈ జోనర్ జోలికి వెళ్లలేదు. హాలీవుడ్ సినిమాల్ని తెలుగులో డబ్ చేసుకుని సంతోషపడిపోయారు. అయితే… మంచి అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకుల్లకు కొత్త అనుభూతిని ఇవ్వడంలో చాలా వరకు సఫలమైంది. సస్పెన్సు చివరి వరకు మెయింటైన్ చేస్తూ చాల ఉత్కంఠభరితంగా సాగుతూ తండ్రి కొడుకుల మధ్య మంచి సంఘర్షణతో ఈ చిత్రం మెప్పిస్తోంది. మొత్తం మీద భిన్నమైన, కొత్త తరహా చిత్రాలను ఇష్టపడేవారికి మరియు అన్ని వర్గాల ప్రేక్షకులకు కూడా ఈ చిత్రం నచ్చుతుంది. ఈ తరహా కథలు మళ్లీ ప్రయత్నించొచ్చు అని చెప్పిన సినిమా ‘గూఢచారి’.