రాజమౌళి టీజర్‌కి గుడ్ రెస్పాన్స్..
బాహుబలితో ప్రపంచవ్యాప్తంగా అభినందనలు అందుకున్న రాజమౌళి మళ్ళీ ఎలాంటి కథాంశం ఎంచుకుంటాడో అని ఆసక్తిగా ఎదురు చూడని సినిమా ప్రేమికుడు లేడు. అలా ఎదురు చూసిన అందర్నీ ఆశ్చర్యపరుస్తూ తెలుగు తెరమీద టాప్ స్టార్లుగా ఉన్న హీరోలను ఇద్దర్ని పెట్టి మల్టీ స్టారర్ గా RRR ని ప్రకటించాడు రాజమౌళి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ యంగ్ టైగర్ యన్టీఆర్ ఇద్దర్నీ ఒప్పించడం ద్వారా ఈ సినిమాపట్ల బాహుబలి స్థాయిలోనే ఆసక్తిని రేకెత్తించగలిగాడు. బాహుబలి సృష్టించిన మేనియాతో తొలిగా రిలీజైన రామ్ చరణ్ టీజర్ ను ప్రేక్షకులు ఎగబడి చూశారు. బహుశా టాలీవుడ్ చరిత్రలో అత్యధిక సంఖ్యలో ప్రేక్షకులు చూసిన టీజర్ ఇదే కావచ్చు. ఈ టీజర్‌కి మిశ్రమ స్పందన లభించింది. సామాన్య ప్రేక్షకులను టీజర్ ఆకట్టుకున్నప్పటికీ.. సాంకేతిక అంశాలపై పట్టున్న పలువురు టెక్నికల్‌గా గొప్పగా లేదని పెదవి విరిచారు. దీంతో ఆర్ ఆర్ ఆర్ తదుపరి టీజర్‌పై కొంత మేర ఆసక్తి తగ్గిందనేది నిజం. ఈ నేపధ్యంలో గురువారం రెండో టీజర్ రిలీజైంది. ఇది ఎన్టీయార్ టీజర్. దీనికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది.
యన్టీఆర్ టీజర్ చూసాక త్రిబుల్ ఆర్ ఖచ్చితంగా బాహుబలి రికార్డులను బ్రేక్ చేసేస్తుందని అనిపించిందంటూ పలువురు సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు. హాలీవుడ్ సినిమాలలో మాత్రమే కనిపించే కొన్ని విజువల్ DOP బ్యాగ్రౌండ్స్ , మేకప్ నేచురాలిటీ యన్టీఆర్ టీజర్లో బాగా కుదిరిందని అభినందిస్తున్నారు. అలాగే యన్టీఆర్ సహజ నటన కూడా టీజర్ కు ప్లస్ పాయింట్ అయ్యింది. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అనే పాయింట్ పైనే పార్ట్ టు సినిమా కలెక్షన్లను కళ్లు తిరిగే రేంజ్లో సాధించిన రాజమౌళి యన్టీఆర్ గెటప్ ఛేంజ్ తో అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ఈ గెటప్‌పై ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చోపచర్చలు నడుస్తున్నాయి. అలాగే కధపై కూడా భిన్నాభిప్రాయాలు, అంచనాలు వెల్లువెత్తుతున్నాయి. ఏదేమైనా.. రెండో టీజర్ ద్వారా మరోసారి తన విజువల్ విజన్‌ని రాజమౌళి ప్రదర్శించాడు. అలాగే ఈ సినిమా విడుదలయ్యే వరకూ ఎవరి అంచనాలకు అందని రీతిలో తన వర్క్ ఉంటుందని కూడా చెప్పకనే చెప్పాడు.













