కరోనాను జయించాను.. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మీకూ అది సాధ్యమే!
ప్రపంచవ్యాప్తంగా కరోనా ఎవ్వరినీ వదిలిపెట్టడంలేదు. చిన్నా, పెద్దా, ధనిక, పేదా అనే తేడా లేకుండా తన ప్రభావాన్ని చూపిస్తోంది. ముఖ్యంగా మనదేశంలో ఎంతోమంది ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. అందులో కొంతమంది చనిపోయారు. మరికొందరు కోలుకుని బయటపడ్డారు. ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం గత కొన్ని రోజులుగా చికిత్స పొందుతూనే ఉన్నారు. తాజాగా మాజీ హీరోయిన్ జెనీలియా తనకు కరోనా వైరస్ సోకిందని ప్రకటించింది. అయితే ఆమెకు మూడు వారాల క్రితమే కరోనా సోకింది. కరోనా లక్షణాలు లేనప్పటికీ టెస్టుల్లో ఆమెకు పాజిటివ్ అని వచ్చింది. దీంతో నిర్లక్ష్యం చేయకుండా దాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలని నిర్ణయించుకుంది. మూడు వారాలపాటు ఐసోలేషన్‌లో ఉంది. మూడు వారాల తర్వాత చేసిన పరీక్షల్లో నెగెటివ్ వచ్చింది.
కరోనా అంతగా బాధించకపోయినా ఐసోలేషన్‌లో ఉన్న రోజులు బాధకు గురిచేశాయన్నారు. ఆ పరిస్థితిని ఎదుర్కోవడం ఛాలెంజింగ్‌గా అనిపించింది. కరోనా నుంచి కోలుకుని కుటుంబాన్ని తిరిగి చేరినందుకు తనకెంతో సంతోషంగా ఉందన్నారు. మీ చుట్టూ ప్రేమించిన వారు ఉంటే అదే మనకు కావాల్సిన బలాన్ని ఇస్తుందన్నారు. ఈ విషయాలన్నీ స్వయంగా తన ట్విట్టర్ ఎకౌంట్లో తెలిపింది జెనీలియా. అంతేకాదు ఈ వ్యాధిని ఎలా జయించవచ్చో వివరించింది. ముందుగానే పరీక్షలు చేయించుకోవడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, ఫిట్‌గా ఉండడం వంటివి చేస్తే సులువుగా కరోనా బారిన పడకుండా ఉండే అవకాశం ఉందని జెనీలియా తెలిపింది. 2012లోనే పెళ్లి చేసుకొని సినిమాలకు గుడ్‌బై చెప్పిన జెనీలియా ఆ తర్వాత నాలుగు సినిమాల్లో అతిథి పాత్రలు పోషించింది. అంతేతప్ప మెయిన్ హీరోయిన్గా ఒక్క సినిమాలో కూడా చేయకపోవడం విశేషం.













