మెగాస్టార్ సినిమాతో రీ ఎంట్రీ?
హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి తనకు మార్కెట్ ఉన్నంత వరకు సినిమాలు చేసి ఆ తర్వాత పెళ్లి చేసుకొని వైవాహిక జీవితంలో మునిగిపోవడం, సినిమాలకు స్వస్తి చెప్పడం చాలా మంది హీరోయిన్ల విషయంలో మనం చూస్తున్నాం. కొన్ని సంవత్సరాల తర్వాత మళ్లీ క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్లను కూడా మనం చూశాం. ఇప్పుడదే మరోసారి రిపీట్ కాబోతోంది.
తెలుగు, తమిళ్, మలయాళ, కన్నడ, హిందీ, మరాఠి భాషల్లో దాదాపు 35 సినిమాల్లో హీరోయిన్గా నటించిన జెనీలియా 2012లో పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత కూడా తనకు ఉన్న కమిట్మెంట్స్తో 2016 వరకు నటిగా కొనసాగింది. ఇక ఆ తర్వాత తెరమరుగైపోయింది. తెలుగులో ఆమె చేసిన సినిమాల్లో బాయ్స్, సై, బొమ్మరిల్లు, హ్యపీ, ఢీ, రెడీ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది జెనీలియా. ఇప్పుడు ఓ భారీ తెలుగు సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందే లూసిఫర్ రీమేక్‌లో జెనీలియా నటించే అవకాశం ఉందని తెలుస్తోంది. మలయాళంలో మంజు వారియర్ చేసిన క్యారెక్టర్ని జెనీలియా చేస్తుందట. ఈ క్యారెక్టర్ కోసం చిత్ర నిర్మాతలు జెనీలియాను అప్రోచ్ అయ్యారని సమాచారం. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ పతాకంపై సాహో దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో రామ్‌చరణ్ ఈ సినిమాను నిర్మిస్తారు. ప్రస్తుతం చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్లో ఆచార్య చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా పూర్తి కాగానే లూసిఫర్ రీమేక్ సెట్స్‌పైకి వెళ్తుంది. ప్రస్తుతం కొనసాగుతున్న లాక్డౌన్ కారణంగా షూటింగులు నిలిచిపోయిన సంగతి తెలిసిందే.













