గేమ్ ఛేంజర్ స్టోరీ ఇదేనా?
ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా క్రేజ్ తెచ్చుకున్న రామ్ చరణ్, తన తర్వాతి సినిమాను స్టార్ డైరెక్టర్ శంకర్ తో చేస్తున్న విషయం తెలిసిందే. గేమ్ ఛేంజర్ సినిమా మూడేళ్ల కిందటే స్టార్ట్ అయినప్పటికీ ఇప్పటికీ షూటింగ్ పూర్తి చేసుకోలేదు. షూటింగ్ పూర్తవకపోవడంతో రిలీజ్ ఎప్పుడనేది ఇంకా తెలియడం లేదు.
ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్ వైజాగ్ లో జరుగుతుంది. ఈ షెడ్యూల్ లో సినిమాలోని కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా కథ ఇదేనంటూ గత రెండ్రోజుల్లో నెట్టింట ఓ కథ ప్రచారమవుతుంది. వైరలవుతున్న సమాచారం ప్రకారం, ఈ సినిమాలో శ్రీకాంత్, నవీన్ చంద్ర, ఎస్ జె సూర్య విలన్లు గా నటిస్తున్నారట.
వీరు ముగ్గురు కలిపి ఆడే పొలిటికల్ గేమ్ ను రంగంలోకి దిగిన ఐఏఎస్ ఆఫీసర్ అయిన చరణ్ ఎలా మట్టుపెట్టాడన్నదే కథగా తెలుస్తోంది. ఒక విలన్ నుంచి మరొక విలన్ వెన్నుపోటు ద్వారా పార్టీని లాక్కుంటాడని, సినిమా మొత్తం చాలా ట్విస్టులతో ఉంటుందని తెలుస్తోంది. రామ్ చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్న ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా, తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.













