గామి.. వర్కవుట్ అయితే ట్రెండ్ సెట్టరే!
ఎప్పుడో ఐదేళ్ల ముందు మొదలైంది విశ్వక్సేన్ సినిమా గామి. విద్యాధర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా క్రౌడ్ ఫండింగ్ తో మొదలైంది. చిన్న సినిమాలకు సోషల్ మీడియాలో క్యాంపైనింగ్ చేయడం ద్వారా క్రౌడ్ ఫండింగ్ వస్తుంది. ఆ డబ్బుతో సినిమా తీస్తారు. ఈ సినిమాలో హీరో ఒక అఘోరాగా కనిపిస్తాడు.
హిమాలయాల్లోని కళ్లు చెదిరిపోయే లొకేషన్లలో ఈ సినిమా షూటింగ్ జరిగింది. ఎంతో కష్టపడి, భారీ సెట్లు ఈ సినిమా కోసం వేశారు. విఎఫ్ఎక్స్ ప్రాధాన్యమున్న ఈ సినిమాను చూస్తుంటే ఒక ఎపిక్ సినిమా అనే ఫీలింగ్ కలుగుతోంది. ఈ సినిమాను చేయడానికి చిత్ర బృందం పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. చివరకు ఆ కష్టాన్ని చూసి యువి క్రియేషన్స్ సంస్థ ముందుకొచ్చి చిత్రానికి అండగా నిలబడింది.
మొత్తానికి ఐదేళ్లకు సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. గామి సినిమాను మార్చి 8న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తూ మేకర్స్ రిలీజ్ చేసి వీడియో చూస్తే విజువల్స్ వావ్ అనిపించాయి. ఈ వీడియోలో టీమ్ పడ్డ కష్టమంతా కనిపిస్తుంది. సినిమా ఆడియన్స్ అంచనాలను అందుకుంటే గామి ట్రెండ్ సెట్టర్ అవ్వడం ఖాయం. క్రౌడ్ ఫండింగ్ తో ఇలాంటి భారీ సినిమా తెరకెక్కి ఆ సినిమా ఆడియన్స్ ను మెప్పిస్తే ఇలాంటి సినిమాలు ముందు ముందు ఎక్కువగా వచ్చే అవకాశాలుంటాయి.













