గొల్లపూడికి చలనచిత్ర పరిశ్రమ ఘనంగా నివాళి
ఇటీవల మృతిచెందిన గొల్లపూడి మారుతీరావుకు తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఘనంగా నివాళి అర్పించిది. ఫిలిం ఛాంబర్లో తెలుగు సినిమా రచయితల సంఘం, తెలుగు చలన చిత్ర దర్శకుల సంఘం, మా నటీనటులు సంఘం శ్రద్ధాంజలి ఘటించారు. పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ మారుతీరావు కమెడియన్గా, విలన్గా, తండ్రిగా ఎన్నో వైవిధ్యమైన పాత్రలను పోషించి ప్రేక్షకుల ఆదరాభిమానాలను చూరగొన్న వ్యక్తి అన్నారు. మా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జీవిత మాట్లాడుతూ ఈ మధ్య కాలంలో ఆణిముత్యాల లాంటి వారిని సినీ పరిశ్రమ కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. వారిలో ఒకరు గొల్లపూడి మారుతీరావు అన్నారు. ఆయన ప్రతిభను పక్కన పెడితే ఆయన గొప్ప మానవతావాది అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో త్రిపురనేని వరప్రసాద్ (చిట్టి), దర్శకుల సంఘం కార్యదర్శి రాంప్రసాద్ మాట్లాడారు. నిర్మాత రామసత్యనారాయణ, సురేష్ కొండేటి తదితరులు పాల్గొన్నారు.













