ఈ నెల 20న విశ్వనాథ్ కు ఘన సన్మానం
దాదాసాహెబ్ ఫాల్కే పురస్కార గ్రహీత విశ్వనాథ్‌ను ఘనంగా సన్మానించేందుకు తెలుగు సినీ పరిశ్రమ సన్నాహాలు చేస్తోంది. ఈ నెల 20న హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో కళా కార్మికుడికి చిత్ర పరిశ్రమ ప్రణామమ్ పేరుతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా పరిశ్రమలోని 24 విభాగాలు కలిసి ఆయన్ని ఘనంగా సత్కరించనున్నారు. ఈ సందర్భంగా ఫిల్మ్ ఛాంబర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్, రచయితల సంఘం అధ్యక్షుడు పరుచూరి గోపాలకృష్ణ, నిర్మాతల మండలి సభ్యులు హాజరై వివరాలు వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని పరిశ్రమ పండుగగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఫాల్కే పురస్కారం అందుకున్న విశ్వనాథ్ నేటితరం దర్శకులకు ఎంతో స్ఫూర్తిగా నిలిచారని నిర్మాత దిల్‌రాజు అన్నారు. ఈ వేడుకకు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు.













