ఏపీ ప్రభుత్వ రాయితీలను హర్షిస్తున్నాం
చిత్ర పరిశ్రమకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ప్రోత్సాహకాలను హర్షిస్తున్నట్లు తెలుగు ఫిలింఛాంబర్స్ ఆఫ్ కామర్స్ సభ్యులు తెలిపారు. అధ్యక్షుడు వీరినాయుడు ఆధ్వర్యంలో ఫిలింఛాంబర్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వీరినాయుడు మాట్లాడుతూ చిత్ర పరిశ్రమకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంది. తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన రాయితీలు మా నిర్మాతలకు సంతోషాన్ని కలిగించాయి. జీఎస్టీని 18 నుంచి 9 శాతం, 28 నుంచి 4 శాతం మినహాయించడాన్ని హర్షిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్‌లో చిత్రీకరణ జరుపుకునే అన్ని చిత్రాలకు ఉచిత లొకేషన్లు ఇవ్వడం, 15 సందేశాత్మక చిత్రాలకు 10 లక్షల రూపాలయ చొప్పున ప్రోత్సాహం అందిచాలనుకోవడం మంచి నిర్ణయం. చిన్న నిర్మాతలకు ఆర్థికంగా ఇవన్నీ వెసులుబాటు కలిగిస్తాయి. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు చిత్ర పరిశ్రమ స్థిరపడేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషిలో మేమూ బాగమవుతాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు వల్లూరిపల్లి రమేష్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, ప్రసన్నకుమార్, వడ్లపట్ల మోహన్‌గౌడ్, పంపిణీదారులు ముత్యాల రాందాస్ తదితరులు పాల్గొన్నారు.













