రీల్ లైఫ్‌లో విలన్.. రియల్ లైఫ్‌లో హీరో!
బాలీవుడ్ నటుడు సోనూసూద్ సినిమాల్లో పాజిటివ్ క్యారెక్టర్లు చేసింది చాలా తక్కువ. విలన్‌గానే ఎక్కువ సినిమాల్లో కనిపించాడు సోను. సినిమాల్లో ఎంత క్రూరమైన విలనో, నిజజీవితంలో అంత మంచి హీరో. ఎవరి మంచితనమైనా ఏదైనా విపత్తు వచ్చినపుడే బయట పడుతుంది. కరోనా అందరి జీవితాలతోనూ ఆడుకుంటోంది. దాని వ్యాప్తిని అరికట్టేందుకు విధించిన లాక్డౌన్ వల్ల ఎంతో మంది జీవితాలు అస్తవ్యస్తంగా మారిపోయాయి. ముఖ్యంగా వలస కూలీల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. ఉన్న ఊళ్లో ఉండలేక, సొంత ఊరికి వెళ్లలేక నానా అవస్థలు పడుతున్నారు. కొంతమంది ప్రాణాలకు తెగించి కొన్ని వందల కిలోమీటర్లు నడుచకుంటూ వెళ్లడం మనం చూస్తున్నాం. ప్రభుత్వాలు కొంత సహాయం చేస్తున్నప్పటికీ అది నామమాత్రంగానే కనిపిస్తోంది. వారిని తమ సొంత ఊళ్ళకు తరలించడం యుద్ధ ప్రాతిపదికన జరగడం లేదన్నది కొందరి అభిప్రాయం. ఆ సమయంలో నటుడు సోనూసూద్ తన బాధ్యతగా ముంబాయిలో చిక్కుకున్న కర్ణాటక వలస కూలీలను తమ సొంత ఊళ్ళకు వెళ్లేందుకు పది బస్సులను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అలాగే పంజాబ్‌లోని డాక్టర్లకు పిపిఇ కిట్లను అందించాడు. అలాగే కరోనా బాధితులకు చికిత్స చేస్తున్న డాక్టర్లు బస చేసేందుకు ముంబాయిలోని తన హోటల్‌ను ఉచితంగా ఇచ్చాడు.
ఇన్ని మంచి పనులు చేస్తూ రియల్ హీరో అనిపించుకుంటున్న సోను సూద్‌కి ఓ వింత అనుభవం ఎదురైంది. తాను ఇంట్లో ఉన్నానని, ఇంటి నుంచి మద్యం షాపు వరకు వెళ్లడానికి సాయం అందించాలని ఓ వ్యక్తి ట్వీట్ చేశాడు. దానికి స్పందించిన సోను సూద్ .. `మద్యం షాపుకు వెళ్లడానికే కాదు, అక్కడి నుంచి ఇంటికి వెళ్లడానికి కూడా సాయం చేస్తాను. ఇది మీకు అవసరం అనుకుంటే నాకు చెప్పండి` అని సమాధానమిచ్చాడు. సోను స్పందించిన తీరుకి అందరూ అతనికి ఫిదా అయిపోయారు. సోను చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మంచి సమాధానమిచ్చారని సోనూ సూద్‌ను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. వలస కూలీలకు సాయం చేసిన సోనూ సూద్‌ను మహారాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి జయంత్ పాటిల్ ప్రశంసించారు. ‘సినిమా స్క్రీన్‌పై విలన్‌గా గుర్తింపు పొందిన సోనూ సూద్ నిజ జీవితంలో హీరో అనిపించుకున్నారు’ అని ట్వీట్ చేశారు.













