విజయ్ దేవరకొండ, అజయ్ భూపతి పేర్లతో రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు
టెక్నాలజీ పెరిగే కొద్దీ మనం చేసే పనులు సులభతరం అవుతాయి. అయితే కొందరికి మాత్రం టెక్నాలజీ తాము చేసే మోసాలకు బాగా ఉపయోగపడుతోంది. టెక్నాలజీ పుణ్యమా అని ఇప్పుడు సైబర్ నేరగాళ్ళు పుట్టుకొస్తున్నారు. దోపిడీ దొంగల కంటే ఎక్కువ దోచుకోవడానికి వీరికి టెక్నాలజీ ఉపయోగపడుతోంది. కొంతమంది బ్యాంకుల పేరుతో మోసం చేస్తారు. కొంతమంది ఆన్లైన్లో జాబ్స్ ఇప్పిస్తామంటూ డబ్బు దండుకుంటారు. ఇప్పుడు మరో తరహా మోసం బయటికి వచ్చింది. అది కూడా సినిమా సెలబ్రిటీల పేరుతో. హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు అజయ్ భూపతి పేర్లతో సోషల్ మీడియాలో దొంగ ఎకౌంట్లు క్రియేట్ చేసి అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటున్న వైనం ఇటీవల వెలుగులోకి వచ్చింది. సినిమాల్లో అవకాశాలు కావాలా? టీవీ సీరియల్స్‌లో నటించాలని ఉందా? మోడలింగ్‌లో పేరు తెచ్చుకోవాలని ఉందా? అయితే మమ్మల్ని సంప్రదించండి అంటూ ఈ నేరగాళ్లు నకిలీ వాట్సప్ నెంబర్ సృష్టించి వారి నుంచి ఫోటోలు వీడియోలు సేకరిస్తున్నారు. వారికి అవకాశాలు ఇప్పిస్తామంటూ నమ్మబలికి వేల రూపాయలు వసూలు చేస్తున్నారు.
ఈ నేరాల్లో దర్శకుడు అజయ్ భూపతి పేరును వాడుకున్నారు. ఈ ప్రకటన చూసిన కొంతమంది అమ్మాయిలు నేరుగా అజయ్‌ను సంప్రదించారు. దీంతో ఇదంతా మోసం అని గ్రహించారు. వెంటనే తన పేరు మీద జరుగుతున్న మోసాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక హీరో విజయ్ దేవరకొండ పేరుతో బాన్సువాడకు చెందిన సాయికిరణ్ అనే వ్యక్తి ఓ యూ ట్యూబ్ ఛానల్ ప్రారంభించాడు. విజయ్ వాయిస్‌ను ఇమిటేట్ చేస్తూ చాలా మంది అమ్మాయిలను ముగ్గులోకి దించే ప్రయత్నం చేశాడు. విషయం తెలుసుకున్న విజయ్ దేవరకొండ పోలీసులతో కలిసి ఒక ప్లాన్ వేశారు. ఒక అమ్మాయిని సాయికిరణ్‌తో మాట్లాడించి అతన్ని హైదరాబాద్‌కి రప్పించారు. ఆ అమ్మాయిని కలిసే సమయంలో సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు.













