మత్తులో సినీ జగత్తు
మాదకద్రవ్యాల్లో తెలుగు సినీ పరిశ్రమ మునకలు
ఎనిమిది మంది ప్రముఖులకు నోటీసుల జారీ
ఓ ప్రముఖ దర్శకుడు
ఒకప్పటి యువ హీరోలు ఇద్దరు
ప్రముఖ హీరోయిన్
ఐటమ్ సాంగ్స్‌కు పేరొందిన ఒకప్పటి నటి
వీరందరూ తమ ముందు హాజరవ్వాలని ఆబ్కారీ అధికారుల ఆదేశం
వాంగ్మూలం తీసుకున్నాక తదుపరి చర్యలు!
తెలుగు సినీ జగత్తు మత్తులో మునిగితేలుతోందా? ఓ అగ్ర దర్శకుడు మొదలు యువ హీరోలు, ఒక మాజీ హీరోయిన్‌తో సహా ఎనిమిదిమంది సినీ ప్రముఖుల పేర్లు బయటకు రావడం టాలీవుడ్లో కలకలం రేకెత్తిస్తోంది. విదేశాల నుంచి మత్తుమందులు దిగుమతి చేసుకుంటున్న కెల్విన్ ముఠా నుంచి సేకరించిన వివరాల ప్రకారం ఈ ఎనిమిదిమందికి నోటీసులు జారీచేసిన ఆబ్కారీ అధికారులు ఈనెల 19 నుంచి వారిని విచారించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. గతంలోనూ కొందరు సినీ ప్రముఖులు మత్తుమందులు వాడుతున్నారనే విషయం బయటకు పొక్కినా రకరకాల కారణాల వల్ల ఎవర్నీ విచారించలేదు. మొదటిసారిగా ఇప్పుడు మాత్రం ఆబ్కారీ అధికారులు సినీ ప్రముఖులకు నోటీసులు జారీచేసి తమ కార్యాలయానికి పిలిపించి విచారించి వారి వాంగ్మూలం నమోదు చేయాలని నిర్ణయించారు. దీంతో మాదకద్రవ్యాలు వ్యవహారం పరిశ్రమలో సంచలనాత్మకంగా మారుతోంది.
కెల్విన్ వలలో చిక్కింది ఎందరో!
మత్తుమందుల వ్యాపారంలో ఆరితేరిన కెల్విన్ మెల్లగా తెలుగు సినీ పరిశ్రమపై కన్నేశాడు. దాదాపు నాలుగేళ్ల క్రితమే అతడికి సినీ పరిశ్రమతో బంధం ఏర్పడింది. ప్రధానంగా ఎల్ఎస్డీ (ఖరీదైన మత్తుమందు) దిగుమతి చేసుకొని సరఫరా చేసే ఈ డాన్ ముందుగా ఓ దర్శకుడితో పరిచయం చేసుకున్నాడు. క్రమంగా పరిచయాలను విస్తరించుకుంటూ అనేకమందికి సరఫరా చేయడం మొదలుపెట్టాడు.
ఇద్దరు యువ హీరోలు, క్యారెక్టర్ ఆర్టిస్టుగా కీలక పాత్రలు పోషిస్తున్న మరో నటుడు, ఒక ఆర్ట్ డైరెక్టర్, మరో ఛాయాగ్రాహకుడి పేర్లు కెల్విన్ ద్వారా బయటకు రావడంతో వారికి ఆబ్కారీ అధికారులు నోటీసులు జారీ చేశారు.
* కెల్విన్ ఫోన్‌ను విశ్లేషించినప్పుడు వెల్లడైన వివరాలు చూసి అధికారులు నోరెళ్లబెట్టారు. ప్రధానంగా ఒక మాజీ హీరోయిన్ ఎల్ఎస్డీకి పూర్తిగా బానిసైందని చెప్పిన కెల్విన్ ‘ఆమె నేను పిలిస్తే ఎక్కడికంటే అక్కడికి వస్తుంది. ఇప్పుడు పిలిపించమంటారా?’ అనడంతో ఆబ్కారీ అధికారులు విస్తుబోయారు. ఎల్ఎస్డీకి అలవాటుపడ్డ మిగతావారి పరిస్థితి కూడా ఇంతేనని వారు చెబుతున్నారు. ఐటమ్ పాటలకు ప్రసిద్ధి చెందిన మరో నటి అయితే మత్తుమందుల కోసం రకరకాలుగా ఒత్తిడి చేసేదని తెలుస్తోంది.
పకడ్బందీ ఆధారాలతో
సినీ పరిశ్రమకు చెందిన వారి పేర్లు బయటకు రావడంతో ఆబ్కారీ అధికారులు అప్రమత్తమయ్యారు. ఏమాత్రం తేడా వచ్చినా కేసు తల్లకిందులయ్యే అవకాశం ఉంది కాబట్టి మూడో కంటికి తెలియకుండా పక్కా ఆధారాలు సేకరించారు. కెల్విన్ ముఠా ఫోన్ వివరాలు, సంభాషణలతోపాటు వివిధ సందర్భాల్లో వీరు కలిసిన కొన్ని వీడియో దృశ్యాలు కూడా సేకరించి పెట్టారు. కెల్విన్ తదితరుల నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. ఎక్కడెక్కడ కలుసుకునేవారు, మత్తుమందులు ఎలా అందుకునేవారు, ఎలా సంభాషించుకునేవారు తదితర వివరాలన్నీ సేకరించారు. దీన్నంతా ఒకటికి రెండుసార్లు పునఃసమీక్షించుకున్నారు.
వారిలోవారే సరఫరాదారులు
వాస్తవంగా మత్తుమందులు వాడుతున్న వారిపై కేసులు పెట్టడం కష్టం. వారి వద్ద ఎంతోకొంత మత్తుమందు ఉన్నప్పుడే చట్టపరంగా వారిపై చర్యలు తీసుకోవచ్చు. అయితే ఇప్పుడు నోటీసులు అందుకున్న వారిలో తమకు అందిన మత్తుమందు ఒకరితో ఒకరు పంచుకునేవారని, ఇది కూడా పంపిణీ కిందికే వస్తుందని అధికారులు నిర్ధారణకు వచ్చారు. దీనికి సంబంధించి న్యాయనిపుణులు, గతంతో ఇలాంటి కేసులు వాదించిన న్యాయవాదులతో చర్చలు జరిపారు. ఇదంతా పూర్తయిన తర్వాతనే సినీప్రముఖులకు నోటీసులు ఇచ్చి వారి వాంగ్మూలం నమోదు చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. నోటీసులు అందుకున్న ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా హాజరుకావాల్సిందేనని, ఎవరైనా గైర్హాజరైతే చట్టపరంగా చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని, దానికి తగ్గట్టుగానే వ్యూహం రూపొందించామని అధికారులు చెబుతున్నారు.
మత్తు వల్లే సంగీత దర్శకుడి మృతి!
సినీ పరిశ్రమలో చాలాకాలంగా మాదకద్రవ్యాల వాడకం జరుగుతోందని, ఇప్పుడది పరాకాష్ఠకు చేరుకుందని అధికారులు భావిస్తున్నారు. ఇటీవల ఒక యువ సంగీత దర్శకుడి అకాల మరణమే ఇందుకు నిదర్శనమని, ఎల్ఎస్డీ ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్లనే అతను చనిపోయినట్లు అధికారులు గుర్తించారు. ఇతనికీ కెల్వినే సరఫరా చేసేవాడు. ఆ సంగీత దర్శకుడు చనిపోయినప్పుడు తన పని అయిపోయినట్లేనని, తనను అరెస్టు చేస్తారేమోనని భయపడ్డానని కెల్విన్ దర్యాప్తు అధికారులు చెప్పినట్లు తెలుస్తోంది. ఇదొక్కటే కాదని, ఎల్ఎస్డీ వాడుతున్న చాలామంది ఇప్పుడు అది లేకపోతే ఉండలేని పరిస్థితికి చేరుకున్నారని అధికారులు చెబుతున్నారు.
అందరికీ ఆయనే
సినీ పరిశ్రమలో ఎల్ఎస్డీకి అలవాటుపడ్డ వారిలో చాలామంది మత్తుకు అలవాటుపడిన ఆ దర్శకుడి శిష్యులేనని తెలుస్తోంది. ఆయన తొలుత తాను ఈ రొంపిలోకి దిగి మిగతా వారికీ అలవాటు చేసినట్లు తెలుస్తోంది.
కొకైన్ది మరో ముఠా
ఇప్పటి వరకూ కెల్విన్ ద్వారా ఎల్ఎస్డీ కొనుగోలు చేస్తున్న వారిని మాత్రమే గుర్తించారు. కాని సినీ పరిశ్రమలో కొకైన్ వాడే బృందం మరొకటి ఉందని, జాక్ అనే వ్యక్తి వీరికి సరఫరా చేస్తున్నాడని గుర్తించారు. కొకైన్ వాడేవారిలో ఇద్దరు ప్రముఖ యువ హీరోలు ఉండగా వీరిద్దరి తండ్రులూ ప్రముఖ నిర్మాతలు కావడం గమనార్హం. అయితే ప్రస్తుతానికి తాము ఎల్ఎస్డీ ముఠాపైనే దృష్టి సారించామని, జాక్‌కు చెందిన కొకైన్ వ్యవహారం సంగతి తర్వాత చూస్తామని ఒక అధికారి వ్యాఖ్యానించారు.
ఆ హీరో అరెస్టు తథ్యమా
ఇదంతా ఒక ఎత్తయితే.. అగ్రస్థానంలో ఉన్న మరో యువహీరో తన డ్రైవర్ ద్వారా కొకైన్ తెప్పించుకునే వాడని సమాచారం. ఆ ఇద్దర్నీ అరెస్టు చేసేందుకు ఇప్పటికే ఆబ్కారీ అధికారులు ఉచ్చు బిగించినట్లు తెలుస్తోంది. తెలుగు సినీ పరిశ్రమలో మాదకద్రవ్యాల వినియోగం ప్రమాదకరస్థాయికి చేరుకుందని, ఇది మరింత విస్తరిస్తోందని, ఇలాగే వదిలేస్తే చేయిదాటిపోయే ప్రమాదం ఉందని భావిస్తున్న అధికారులు కఠిన చర్యలకు సిద్ధమయ్యారు.













