కేబుల్ టీవీలో ప్రసారమైన కొత్త సినిమా.. కోటి రూపాయలు నష్టపరిహారం డిమాండ్ చేసిన ఈటీవీ!
పెద్ద హీరోల సినిమాలకు పైరసీ బెడద ఎప్పుడూ ఉంటుంది. సినిమా రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే పైరసీ ప్రింట్ నెట్లో కనిపిస్తుంది. ఈ విషయంలో ప్రతి హీరో ప్రేక్షకులకు విజ్ఞప్తి చేస్తూనే ఉంటాడు. సినిమాను థియేటర్లోనే చూసి ఆనందించండి, పైరసీని అరికట్టండి అని. కానీ, పైరసీ మాత్రం తగ్గలేదు. ఇప్పటి పరిస్థితినే తీసుకుంటే ఇప్పుడు థియేటర్స్ లేవు. సినిమా రిలీజ్లు లేవు. ఈ సమయంలో నిర్మాతలకు ఓటీటీ ఓ వరంలా కనిపిస్తోంది. తమ సినిమాలను ఓటీటీ ద్వారా విడుదల చేసేందుకు కొంతమంది నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే చాలా సినిమాలు ఓటీటీలో రిలీజ్ అయ్యాయి. జయాపజయాలు పక్కన పెడితే ముందు తమ సినిమాను ప్రేక్షకుల దగ్గరకు తీసుకెళ్లేందుకు నిర్మాతలకు మంచి ప్లాట్‌ఫామ్ దొరికింది. అయితే ఇక్కడా వారికి పైరసీ బాధలు తప్పడం లేదు. సత్యదేవ్ ప్రధాన పాత్రలో రూపొందిన `ఉమామహేశ్వర ఉగ్రరూపస్య` చిత్రం ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. ఓటీటీల ద్వారా విడుదలయ్యే సినిమాలకు పైరసీ బెడద ఎక్కవగా ఉంటుంది.
అలాగే ఈ సినిమాకి కూడా జరిగింది. కొందరు అత్యుత్సాహంతో ఈ సినిమా లింక్‌ను యూ ట్యూబ్‌లో పెట్టారు. ఆ లింక్ ద్వారా ఒక కేబుల్ టీవీ సంస్థ ఈ సినిమాను ప్రసారం చేసింది. దీంతో అసలు గొడవ మొదలైంది. డిజిటల్ రైట్స్‌ని నెట్‌ఫ్లిక్స్‌కి ఇచ్చిన నిర్మాతలు శాటిలైట్ హక్కులను మాత్రం ఈటీవీకి అమ్మారు.
`ఉమామహేశ్వర..` కేబుల్ టీవీలో ప్రసారం కావడంతో రంగంలోకి దిగిన ఈటీవీ యాజమాన్యం సదరు కేబుల్ టీవీ నెట్‌వర్క్‌కు లీగల్ నోటీసులు పంపారు. ఈ సినిమాపై శాటిలైట్ హక్కులు తమ ఛానల్‌కి ఉన్నందున సినిమాను కేబుల్ టీవీలో ప్రసారం చేసినందుకు తమకు కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలని ఆ నోటీసులో పేర్కొంది ఈటీవీ. దీంతో ఆ కేబుల్ టీవీ సీఇఓ ఈటీవీ వారిని కలిసి తమ తప్పును ఈసారికి క్షమించాలని, ఇకపై ఇలాంటి పొరపాట్లు తమ కేబుల్ టీవీలో జరగకుండా చూసుకుంటానని హామీ ఇచ్చాడట. దాంతో వెనక్కి తగ్గిన ఈటీవీ యాజమాన్యం ఆ కేబుల్ టీవీ సీఇఓకి వార్నింగ్ ఇచ్చారట. గత సంవత్సరం విడుదలై అందరి ప్రశంసలు అందుకున్న `కేరాఫ్ కంచరపాలెం` దర్శకుడు వెంకట్ మహా దర్శకత్వంలో `ఉమామహేశ్వర ఉగ్రరూపస్య` చిత్రం రూపొందింది. ఆర్కా మీడియా వర్క్స్ కూడా ఈ సినిమాకి భాగస్వామిగా ఉంది.













