బుల్లితెరకు తారక్ రీఎంట్రీ?
బిగ్ బాస్ షో ను మా టీవీ ఆరేళ్ల కిందట తెలుగులో లాంఛ్ చేసినప్పుడు ఆ షో కు హోస్ట్ గా జూనియర్ ఎన్టీఆర్ వ్యవహరించాడు. ఆ షో ను ఎన్టీఆర్ నడిపించిన తీరుకు అందరూ ఫిదా అయ్యారు. ఇప్పటికీ బిగ్ బాస్ ఫ్యాన్స్ ఎన్టీఆర్ హోస్టింగ్ ని ఇష్టపడతారు. ఆ తర్వాత సినిమాలతో బిజీ అవడం వల్ల మిగిలిన సీజన్లు హోస్ట్ చేయలేకపోయాడు ఎన్టీఆర్.
తర్వాత కొంచెం గ్యాప్ తీసుకుని ఎవరు మీలో కోటీశ్వరులు షో ను హోస్ట్ చేసి ఆ షో పాపులారిటీని మరింత పెంచాడు తారక్. ఆ తర్వాత తారక్ డేట్లు ఖాళీ లేకపోవడంతో జెమినీ సెకండ్ సీజన్‌ను చేయడం ఇష్టం లేక ఎన్టీఆర్ కోసం వెయిట్ చేసే ధోరణిలో ఉంది. ఇప్పట్లో ఆ షో ఉండకపోవచ్చు కూడా. ఇదిలా ఉంటే రీసెంట్ గా ఈటీవీ విన్ యాప్ పేరుతో ఓటీటీలోకి అడుగుపెట్టిన ఈటీవీ కూడా తారక్‌తో ఓ టాక్ షో ప్లాన్ చేసినట్లు సమాచారం.
విన్ యాప్ లాంఛ్ తర్వాత యాప్ కు సబ్స్క్రిప్షన్ రేట్లు పెట్టి థియేటర్ రిలీజ్ కాని సినిమాలను, డైరెక్ట్ స్ట్రీమింగ్ కోసం కొనుగోలు చేస్తున్నారు. అందులో భాగంగానే రీసెంట్గా రవిబాబు అసలు మూవీ విన్ యాప్ లోనే రిలీజ్ అయింది. ఇప్పుడు ఈ యాప్ పాపులారిటీని మరింత పెంచడం కోసం జూనియర్ ఎన్టీఆర్ తో ఓ షో నిర్వహించాలనుకుంటోంది ఈ టీవీ యాజమాన్యం.
ఈనాడు తో ఎన్టీఆర్ కు మంచి బాండింగే ఉంది. తన మొదటి సినిమా నిన్ను చూడాలని ఉంది ని నిర్మించింది ఉషాకిరణ్ మూవీసే. ఒకవేళ తారక్ ఆ రీజన్‌తో ఈ షో చేయడానికి ఒప్పుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. తారక్ ఒప్పుకుంటే మాత్రం ఈటీవీకి ఓ మంచి ఛాన్స్ దొరికినట్లే. కానీ సినిమాల పరంగా చాలా బిజీగా ఉన్న ఎన్టీఆర్, ఈ షో కు డేట్స్ అడ్జస్ట్ చేయడం అంటే మామూలు విషయమేమీ కాదు. మరి చూడాలి ఈ షో గురించి తారక్ ఎలా రెస్పాండ్ అవుతాడో.













