మరో లవ్ స్టోరీ తో రానున్న దుల్కర్
మమ్ముట్టి కొడుకుగా తెరంగేట్రం చేసిన దుల్కర్ సల్మాన్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. మలయాళంతో పాటూ కన్నడ, తమిళ, తెలుగు భాషల్లోకి కూడా దుల్కర్ సినిమాలు డబ్బింగ్ అవుతున్నాయి. రీసెంట్గా తెలుగులో నేరుగా వచ్చిన సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు దుల్కర్ సల్మాన్.
తన క్యారెక్టర్ కు తానే డబ్బింగ్ చెప్పుకున్న దుల్కర్, సీతారామం లో గొప్ప నటన కనబర్చి విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకున్నాడు. సీతారామం తర్వాత దుల్కర్‌కు తెలుగు మార్కెట్ కూడా బాగా పెరిగింది. దీంతో మొన్న రిలీజ్ అయిన కింగ్ ఆఫ్ కొత్త సినిమాను కూడా తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు.
ఇప్పటి వరకు సాఫ్ట్ గా ఉండే క్యారెక్టర్లు చేసిన దుల్కర్ ఈ సినిమాలో మాస్ క్యారెక్టర్లో నటించి ప్రేక్షకుల్ని మెప్పించాడు. ఇక అసలు విషయానికొస్తే సీతారామం తర్వాత దుల్కర్ తెలుగులో మరో సినిమా చేసేందుకు రెడీ అవుతున్న విషయం తెలిసిందే. పరశురామ్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన రవి తన డెబ్యూ సినిమాను దుల్కర్ హీరోగా తీస్తున్నాడు.
సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మించనుండగా, ఈ సినిమాకు జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నాడు. ఇంకా హీరోయిన్ ఎవరనేది స్పష్టం కాలేదు. ప్రేమ కథా చిత్రంగా తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్ సగభాగం పైగా అమెరికాలోనే షూటింగ్ జరుపుకోనుందని సమాచారం. సీతారామం లాంటి లవ్ స్టోరీ తో తెలుగులో తన మార్కెట్‌ను పెంచుకున్న దుల్కర్‌కు ఈ సినిమా ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.






