‘దృశ్యం’ సీక్వెల్‌కి రంగం సిద్ధం!
2013లో మలయాళంలో రూపొందిన సినిమా `దృశ్యం`. మోహన్‌లాల్, మీనా ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ సినిమా అక్కడ ఘనవిజయం సాధించింది. ఆ తర్వాత ఈ సినిమాను పలు భాషల్లో రీమేక్ చేశారు. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, సింహళి భాషల్లో రీమేక్ అయి ఎక్కువ భాషల్లో రీమేక్ అయిన చిత్రాల్లో ఒకటిగా `దృశ్యం` పేరు తెచ్చుకుంది. చైనా భాషలో రీమేక్ అయిన తొలి భారతీయ సినిమా ఇదే కావడం విశేషం. మలయాళంలో మోహన్‌లాల్ సరసన నటించిన మీనా తెలుగులో వెంకటేష్ సరసన నటించింది. తమిళ్లో కమల్‌హాసన్, గౌతమి నటించారు. ఇప్పుడీ సినిమాకు సీక్వెల్‌గా `దృశ్యం2` చేయబోతున్నట్టు మలయాళ `దృశ్యం` దర్శకుడు జీతు జోసెఫ్ ప్రకటించారు.
మొదటి భాగంలో నటించిన మోహన్‌లాల్, మీనా రెండో భాగంలోనూ భార్యాభర్తలుగా నటించనున్నారు. మిగతా పాత్రల్లో నటించే నటీనటులు మాత్రం మారతారని తెలిపారు. ప్రస్తుతం లాక్డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా షూటింగులు నిలిపి వేసిన విషయం తెలిసిందే. కేరళలో సినిమా షూటింగులకు అనుమతి ఇవ్వగానే `దృశ్యం2` చిత్రాన్ని మొదలుపెడతామని దర్శకుడు జీతు జోసెఫ్ తెలిపారు. మొదటి భాగం ఎక్కువ భాషల్లో రీమేక్ అయి రికార్డు సృష్టించింది. మరి ఈ రెండో భాగంలో ప్రేక్షకుల్ని కట్టి పడేసే అంశాలు ఏం ఉంటాయో? ఈ సినిమా ఎన్ని భాషల్లో రీమేక్ అవుతుందో చూడాలి.













