నిర్మాతలందరికీ ఆదర్శం మూవీమొఘల్ డా.డి.రామానాయుడు
మూవీ మొఘల్ డా॥ డి.రామానాయుడు…
ఈ పేరు భారతీయ చలనచిత్ర పరిశ్రమలో సువర్ణాక్షరాలతో లిఖించదగింది. 13 భారతీయ భాషల్లో సినిమాలు తీసి ఖ్యాతిని ఆర్జించిన ఘనుడు. 150కి పైగా సినిమాలు నిర్మించి గిన్నిస్‌బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించిన నిత్యకృషీవలురు. చలన చిత్ర పరిశ్రమకు రామానాయుడు చేసిన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం ఆయన్ను దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుతో సత్కరించుకుంది. ఆయన ఇంతటి మహోన్నత స్థానాన్ని సంపాదించడం వెనుక ఎంతో కృషి, పట్టుదల, దీక్ష ఉన్నాయి. మంచి సినిమాలు తియ్యాలని, నిర్మాతగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించు కోవాలని చాలా మంది కలలు కంటారు. కానీ, ఆ కలలను సాకారం చేసుకోవడానికి ఎంతో శ్రమించాల్సి ఉంటుంది. ఇవన్నీ చేయాలంటే సినిమా అంటే ప్యాషన్ ఉండాలి. అలాంటి నిజమైన ప్యాషన్‌తో సినిమా రంగంలోకి అడుగు పెట్టి నమ్మినబంటు చిత్రానికి నలుగురు నిర్మాతల్లో ఒకరిగా రామానాయుడు ప్రయాణం ప్రారంభించారు. ఆ తర్వాత అనురాగం చిత్రంతో నిర్మాతగా మారారు. సురేష్ ప్రొడక్షన్స్ సంస్థను ప్రారంభించి రాముడు భీముడు సినిమాను నిర్మించారు. ఆ సినిమా ఘనవిజయం సాధించడంతో సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్‌గా ఆయన జర్నీ మొదలైంది.
ఎన్టీఆర్, ఎ.ఎన్.ఆర్, కృష్ణ, శోభన్‌బాబు, కృష్ణంరాజు వంటి స్టార్స్‌తో, నేటి తరం అగ్ర కథానాయకులైన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్, రజనీకాంత్, కమల్‌హాసన్‌తో ఎన్నో విజయవంతమైన సినిమాలు నిర్మించారు. నిర్మాతగా 52 ఏళ్ళ సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో మైలురాళ్ళ వంటి విజయాలు ఆయన్ను వరించాయి. ఎంతో కష్టపడి ఉన్నత స్థానానికి వచ్చిన రామానాయుడు అంటే కొత్తగా వచ్చే నిర్మాతలకు ఆదర్శం. తనలాగే అందరూ వృద్ధిలోకి రావాలని ఆయన కోరుకుంటారు. అందుకే కొత్త టాలెంట్‌ను ఆయన బాగా ప్రోత్సహించేవారు. వారి టాలెంట్‌పై నమ్మకం కలిగితే అవకాశాలివ్వడానికి ఏమాత్రం వెనుకాడే వారు కాదు. అలా 24 మంది దర్శకులను, ఆరుగురు హీరోలను, 14 మంది హీరోయిన్లను, నలుగురు సంగీత దర్శకులను పరిచయం చేశారు రామానాయుడు.













