దొరసాని ట్రైలర్ను విడుదల చేసిన సుకుమార్
ఆనంద్ దేవరకొండ, శివాత్మిక జంటగా నటిస్తున్న చిత్రం దొరసాని. జులై 12న విడుదల అవుతున్న ఈ చిత్రం ట్రైలర్ను ప్రముఖ దర్శకుడు సుకుమార్ చేతుల మీదుగా విడుదల చేశారు. కె.వి.ఆర్. మహేంద్ర దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మధురా శ్రీధర్ రెడ్డి, యష్.రంగినేని సంయుక్తంగా నిర్మించిన చిత్రమిది. సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో విడుదల చేస్తున్నారు. నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ కథ నిజాయితీగా చెప్పినట్టుగానే సినిమా కూడా అంతే నిజాయితితో తీశాడు దర్శకుడు. అందరూ కొత్తవాళ్లు పనిచేశారు. దొరసాని అన్ని వైపులా పాజిటివ్ బజ్ క్రియేట్ అవుతోంది అన్నారు.
చిత్ర దర్శకుడు కె.వి.ఆర్ మహేంద్ర మాట్లాడుతూ దొరసానిలో ఒక వాస్తవికత ఉంది. స్వచ్ఛత ఉంది. ఎనభై దశకాల్లో నిడచే ప్రేమకథ ఇది. అప్పటి సామాజిక పరిస్థితుల్లో దొరసానితో ప్రేమలో పడితే ఆ ప్రేమ కథ ఎలాంటి ప్రయాణం చేసింది అనేది చెప్పే ప్రయత్నం చేశాను అని చెప్పారు. అతిథిగా విచ్చేసిన సుకుమార్ మాట్లాడుతూ విజువల్స్, బ్యాక్గ్రౌండ్ బావున్నాయి. ఇప్పుడు తెలుగు సినిమా తీరు మారింది. నిజాయితీ నిండిన కథలే ప్రేక్షకుల మనుసులు గెలుచుకుంటున్నాయి. కొత్త దర్శకులు చాలా మంచి సినిమాలతో వస్తున్నారు. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆనంద్ దేవరకొండ, శివాత్మిక, జీవిత, దొరస్వామిరాజు తదితరులు కూడా మాట్లాడారు.













