యువ హీరో ఇప్పుడైనా జాగ్రత్త పడతాడా?
తెలుగు సినీ పరిశ్రమలో హీరోగా నిలబడాలని ఎంతోకాలంగా చాలా మంది ట్రై చేస్తూనే ఉన్నారు. కెరీర్ మొదలు పెట్టి పదేళ్లు దాటినా ప్రయత్నాలు మాత్రం ఇంకా ఆగలేదు. ఎప్పుడో వచ్చనప్పుడు హిట్ కొట్టాడు కానీ ఆ తర్వాత అన్నీ ఫ్లాప్ సినిమాలే మూట గట్టుకున్నాడు యువ హీరో ఆది సాయికుమార్.
సాయి కుమార్ కొడుకుగా 2011 లో ప్రేమ కావాలి సినిమాతో ఇండస్ట్రీలోకి తెరంగేట్రం చేసిన ఆది ఫస్ట్ సినిమా మంచి మ్యూజికల్ హిట్ అవడంతో మంచి డెబ్యూ నే జరిగిందని అందరూ అనుకున్నారు. దానికి తగ్గట్టు తన రెండో సినిమా లవ్ లీ కూడా బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. ఇక ఆదికి తిరుగులేదనుకుంటున్న సమయంలో తన బ్యాడ్ టైమ్ మొదలైంది. లవ్ లీ దగ్గర ఆగిపోయిన తన సక్సెస్, ఇప్పటి వరకు మళ్లీ ట్రాక్ ఎక్కలేదు. వరుసగా దాదాపు 11 సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. తాజాగా శశి సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఆదికి మళ్లీ అదే పరాజయమే ఎదురైంది. ఒకే ఒక లోకం నువ్వే పాటతో సినిమాకు బజ్ అయితే వచ్చింది కానీ సినిమాలో కంటెంట్ లేకపోవడంతో జనాలు ఆ సినిమాను తిరస్కరించారు. ఫలితం ఆది ఖాతాలో మరో పరాజయం. మరి వరుసగా ఇన్ని ఫ్లాపుల తర్వాత ఇప్పుడైనా ఆది సాయికుమార్ జాగ్రత్తగా కథలను ఎంపిక చేసుకుంటాడేమో చూడాలి.













