వెకేషన్ లో వేణు స్క్రిప్ట్ వర్క్
ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం సక్సెస్ అనేది ఎంతో ఇంపార్టెంట్ అయింది. సక్సెస్‌తోనే ఎవరి కెరీర్ అయినా ముడిపడి ఉంటుంది. ముఖ్యంగా డైరెక్టర్లకు ఈ సక్సెస్ చాలా కీలకంగా మారింది. అందుకే హిట్ కొట్టడం ఆలస్యం, దాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి వెంటనే ఆ మూడ్ లోకి వెళ్లిపోతున్నారు. ప్రస్తుతం వేణు ఎల్దండి కూడా ఇదే మూడ్ లో ఉన్నాడు.
కమెడియన్ గా ఇప్పటికే అందరికీ సుపరిచితుడైన వేణు, బలగం సినిమాతో మెగాఫోన్ పట్టి ప్రేక్షకులతో పాటూ విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నాడు. కంటెంట్ తో పాటూ కమర్షియల్ హిట్ కూడా అందుకున్న వేణు ప్రస్తుతం విదేశీ పర్యటనల్లో ఉన్నాడు. బలగం రిలీజ్ తర్వాత ఓ నెల పాటూ ప్రమోషన్స్ లో పాల్గొని సినిమాను మరింత ప్రమోట్ చేశాడు వేణు.
సినిమా ఎప్పుడైతే ఓటీటీలోకి వచ్చేసిందో వేణు వెకేషన్ మోడ్ లోకి వెళ్లిపోయాడు. ఇప్పటికే తన ఫ్రెండ్స్ తో, ఫ్యామిలీతో రెండు మూడు వెకేషన్స్ ముగించుకున్న వేణు, ఇప్పుడు అమెరికాను చుట్టేస్తున్నాడు. ఇందులో భాగంగానే డల్లాస్ లో దిగిన కొన్ని ఫోటోలను నెట్టింట షేర్ చేశాడు. ఇదిలా ఉంటే మొదటి సినిమాను దిల్ రాజు బ్యానర్ లో చేసిన వేణు, రెండో సినిమాను కూడా దిల్ రాజుతోనే చేయబోతున్నాడు.
దిల్ రాజు, వేణు కు బలగం టైమ్ లోనే ఈ ఆఫర్ ఇవ్వగా, ఇప్పుడు వేణు కోసం భారీ బడ్జెట్ తో పాటూ మంచి కాస్టింగ్ ను కూడా సెట్ చేసే పనిలో ఉన్నాడట. వేణు కూడా దిల్ రాజుకు ఓ పాయింట్ చెప్పి మెప్పించి, దిల్ రాజుతో ఓకే చేయించుకున్నాడట. ఇప్పుడు వేణు వెకేషన్ లో నుంచి స్క్రిప్ట్ వర్క్ కూడా చేస్తున్నాడని తెలుస్తోంది.













