మిస్‌మ్యాచ్ ట్రైలర్ విడుదల చేసిన సురేందర్‌రెడ్డి
మిస్‌మ్యాచ్ టైటిల్ అద్భుతంగా ఉంది. ట్రైలర్ నాకు బాగా నచ్చింది. ప్రతిభావంతులైన నటీనటులు, సాంకేతిక నిపుణుల కలయికలో అంకితభావంతో తెరకెక్కించిన ఈ చిత్రం పెద్ద విజయాన్ని సాధిస్తుందనే నమ్మకముంది అని అన్నారు దర్శకుడు సురేందర్‌రెడ్డి. ఉదయ్‌శంకర్, ఐశ్వర్య రాజేష్ జంటగా నటించిన చిత్రం మిస్ మ్యాచ్. ఎన్.వి.నిర్మల్‌కుమార్ దర్శకుడు. శ్రీరామ్‌రాజు, భరత్‌రామ్ నిర్మించారు. డిసెంబర్ 6న విడుదల కానుంది. ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను హైదరాబాద్‌లో దర్శకుడు సురేందర్‌రెడ్డి విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉదయ్‌శంకర్ నటన బాగుంది. తమిళంలో డాక్టర్సలీమ్ తో దర్శకుడిగా మంచి పరు తెచ్చుకున్న నిర్మల్‌కుమార్‌కు తెలుగులో ఈ చిత్రం శుభారంభాన్ని అందించాలి అని తెలిపారు.
దర్శకుడు మాట్లాడుతూ నేను దర్శకత్వం వహించిన తొలి తెలుగు సినిమా ఇది. ఐశ్వర్యరాజేష్, ఉదయ్‌శంకర్ కెమిస్ట్రీ బాగుంటుంది అన్నారు. భిన్న ధృవాల్లాంటి రెండు కుటుంబాల కథ ఇది. జీవితంలో కోల్పోయిన బంధాల్ని ఓ జంట ఎలా తిరిగి పొందారనే అంశాన్ని దర్శకుడు నిర్మల్ హృద్యంగా తెరపై ఆవిష్కరించారు అని రచయిత భూపతిరాజు చెప్పారు. చక్కటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది, తొలిప్రేమ సినిమాలోని ఈ మనసే.. పాటను ఇందులో రీమిక్స్ చేశామని నిర్మాత పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉదయ్‌శంకర్, రాజేంద్రకుమార్, మధుసూదన్, గిఫ్టన్ ఇలియాస్ పాల్గొన్నారు.













