నేను కూడా యోధుడ్ని అవుతాను : రాజమౌళి
కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయిన వారి నుంచి ప్లాస్మాను సేకరించి దాని ద్వారా కరోనాతో బాధపడుతున్నవారికి చికిత్స అందిస్తున్న విషయం తెలిసిందే. ప్లాస్మా దానం చేసేందుకు ఎంతోమంది ముందుకు వస్తున్నారు. అయితే కొంతమంది మాత్రం కొన్ని అపోహలతో ప్లాస్మాను దానం చేసేందుకు వెనుకడుగు వేస్తున్నారు. అలాంటి వారికి అవగాహన కల్పించేందుకు పోలీస్ శాఖ తరచూ అవగాహనా కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్న విషయంలో తెలిసిందే. అందులో భాగంగానే మంగళవారం నిర్వహించిన ప్లాస్మా దాతల అభినందన కార్యక్రమంలో ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “పోలీస్ అంటే నాకు ఒక అపోహ ఉండేది. నేరం జరిగినప్పుడు మాత్రమే వస్తారు అని. కానీ, అది నిజం కాదని, రక్షక భటులనే పేరును సార్థకం చేసుకునేందుకు పలు రకాల సేవలు అందిస్తున్నారు పోలీసులు. ఇది వారి డ్యూటీలో భాగంగా కాకపోయినా ప్రజలకు ఎలాంటి సహాయం కావాలి అని ఆలోచించి సమాజం కోసం అన్నిరకాల సేవలు అందించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా సైబరాబాద్ సీపీ సజ్జనార్‌ను అభినందిస్తున్నాను. వాలంటీర్లను, సెలబ్రిటీలను తీసుకొచ్చి.. ఓ వేదిక కల్పిస్తున్నారు. ఇది చిన్న విషయం కాదు. ఫొటోలు దిగి వెళ్లిపోవడం అంతకన్నా కాదు. దాని కోసం చాలా కష్టపడుతున్నారు. ప్లాస్మా దాతలను, కోవిడ్ పేషంట్లను అనుసంధానం చేయడం … రోజుకు 70మంది ప్లాస్మా దాతలను తీసుకురావడం చాలా గొప్ప విషయం. దాతలు మాట్లాడుతూంటే నిజమైన యోధులనిపిస్తోంది. రోజూ చాలా మంది హీరోలను చూస్తుంటాను. ఈరోజు ప్రత్యక్షంగా హీరోలను చూస్తున్నా. త్వరగా ఇమ్యునిటీ డెవలప్ అయితే.. నేనూ ప్లాస్మా డొనేట్ చేస్తాను. దాతలతో పాటు కలిసి వారియర్‌ను అవుతాను. దాతల తల్లిదండ్రులు ప్లాస్మా విషయంలో భయపడుతున్నారని తెలిసింది. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. అంతా సవ్యంగా జరుగుతుంది. ప్లాస్మా ఇస్తే.. శక్తి తగ్గుతుందని బాధపడకండి. ఉన్నత ప్రమాణాలతో ప్లాస్మా తీసుకుంటున్నారు. మీ పిల్లలు హీరోలయ్యే అవకాశాన్ని వదులుకోకండి. అందరం కలిస్తే విజయం సాధించగలం. ప్లాస్మా అనేది బ్రహ్మాస్త్రం. ముందస్తు చర్యలు తీసుకుంటే … ప్రతి రోగిని బాగు చేయగలం. ఇదేమీ బలమైన వైరస్ కాదు. చాలా బలహీనమైనది. అందరికీ ఇంత సేవ చేస్తున్న సజ్జనార్గారికి అందరం సపోర్ట్ చేద్దాం“ అన్నారు.













