ఇంగ్లండ్‌కు మహారాణి అవడం కంటే.. ఓ బిడ్డకు తల్లి కావడం మహిళకు గొప్ప సంతోషాన్నిస్తుంది : మారుతి
కొంతమందికి నోటి దురద ఉంటుంది. దాన్ని ఎంత కంట్రోల్ చేసుకుందామనుకున్నా వారి వల్ల కాదు. ఏదో ఒక రోజు, ఏదో ఒక సందర్భంలో అది బయటపడుతూనే ఉంటుంది. ముఖ్యంగా సెలబ్రిటీలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసినపుడు నలుగురూ వారివైపే చూస్తారు. వాళ్ళు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తారు. కానీ, ఒక బాధ్యత గల జర్నలిస్ట్ కామెంట్ చేస్తే.. బాలీవుడ్ హీరోయిన్, విరాట కోహ్లి భార్య అనుష్క పెట్టిన ఓ పోస్ట్‌కి అలాంటి అనుభవమే ఎదురైంది. తాను త్వరలో తల్లిని కాబోతున్నానని, ఆ ఆనందాన్ని అందరితో పంచుకుంటున్నానంటూ ట్విట్టర్లో ఓ పోస్ట్ పెట్టింది. ఆ పోస్ట్ చూసి అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. అనుష్కకు అందరూ అభినందనలు తెలియజేశారు. కానీ, ఓ మహిళా జర్నలిస్ట్ మాత్రం తన నోటి దురదను ప్రదర్శించింది. ఆ పోస్ట్‌పై వ్యంగ్యంగా వ్యాఖ్యానించింది. `అతను మిమ్మల్ని తల్లిని మాత్రమే చేశాడు. ఇంగ్లండ్‌కు మహారాణిని చేయలేదు. మరీ, అంత సంబరపడకు` అంటూ ఆ జర్నలిస్ట్ చేసిన పోస్ట్ అందర్నీ ఆగ్రహానికి గురిచేసింది. టాలీవుడ్ డైరెక్టర్ మారుతి ఆ మహిళా జర్నలిస్ట్ చేసిన కామెంట్‌పై స్పందిస్తూ..
`మీరు జర్నలిస్ట్ అయి ఉండి, అందులోనూ మహిళ అయి ఉండి అలాంటి కామెంట్ చేయడం విచారకరం. ఇంగ్లండ్‌కు మహారాణి కావడం కంటే ఓ బిడ్డకు తల్లి కావడం ఓ మహిళకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. అవును.. ప్రతి మహిళా ఒక మహారాణే. సంతోషంతో నిండిన ప్రతి ఇల్లూ ఓ గొప్ప సామ్రాజ్యమే. ఆమె సెలబ్రిటీ కావడం కంటే ముందు ఓ సాధారణ మహిళ. తల్లి కాబోతున్న క్షణాలను ఆస్వాదించే హక్కు ఆమెకు ఉంది` అని ఘాటుగా సమాధానమిచ్చాడు. నిజమే, ప్రతి మహిళకూ తన ఇల్లు ఓ సామ్రాజ్యం వంటిదే. మహిళ తల్లి కావడం సహజం. ఆ ఆనందాన్ని నలుగురితో పంచుకోవాలని కోరుకోవడం కూడా సహజమే. దాన్ని వ్యతిరేకించే హక్కు, దాని గురించి వ్యంగ్యంగా మాట్లాడే హక్కు ఎవరికీ లేదు.













