తెలుగు సినీపరిశ్రమ మీరు చేసిన సేవలు మర్చిపోదు… నేడు దాసరి 73వ జయంతి
తెలుగు సినిమా పరిశ్రమలో ఎంతోమంది దర్శకులు తమ ప్రతిభతో రాణించారు. కానీ తెలుగు సినిమాను ఒక స్టార్ రేంజ్ లో ఉన్నత స్థానంలో కూర్చోబెట్టింది మాత్రం దాసరి నారాయణరావు మాత్రమే అని చెప్పొచ్చు. నేడు ఆయన 73వ జయంతి. పరిశ్రమలో దర్శక దిగ్గజంగా ఎదిగినా ఆయన టచ్ చేయని సబ్జెక్టు లేదు. జోనర్ ఏదైనా దర్శకత్వ విభాగంలో ఆయన చెరగని ముద్ర వేశారు. దర్శకులందరికీ ‘గురువు గారు’ గా ఎదిగారు. ఎందరో దర్శకులు ఆయన శిష్యరికం చేసి ఎదిగిన వారే.
కలర్ సినిమా స్కోప్ లో సినిమాలు వస్తున్న సమయం లో కమెడియన్ రాజబాబును హీరోగా పరిచయం చేస్తూ బ్లాక్ అండ్ వైట్ ఫ్లాట్ మూవీ తో దర్శకుడిగా 1972లో తాత-మనవడు సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. తొలి సినిమానే 25వారాలు రన్ కావడం.. అక్కడి నుంచి ఆయన దర్శక సృష్టి దిగ్విజయంగా కొనసాగడం ఓ చరిత్ర. దర్శకత్వానికి కొత్త నిర్వచనం ఇచ్చి ప్రతి దర్శకుడికి కేరాఫ్ అడ్రస్ లా నిలిచారు. ఓ దశలో ఆయన వరుసగా 8 సినిమాలను సూపర్ హిట్లు చేశారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ నుంచి చిరంజీవి జనరేషన్ హీరోలందరితో ఆయన సినిమాలు తీశారు.స్వర్గం నరకం, ఇదెక్కడి న్యాయం? నీడ, ఎమ్మెల్యే ఏడుకొండలు, బొబ్బిలిపులి, సర్దార్ పాపారాయుడు, మేఘసందేశం, ప్రేమాభిషేకం, ఒసేయ్ రాములమ్మ.. వంటి అద్భుతాలెన్నో తీశారు. నటుడిగా మామగారు, సూరిగాడు వంటి సినిమాలు ఆయనకు కీర్తి కిరీటాలు. రచయితగా కూడా వందలాది సినిమాలకు పనిచేశారు. హీరోలకు మాత్రమే వుండే అభిమాన సంఘాలు ఒక దర్శకుడికి కూడా వుంటాయని వందల సంఖ్యలో అభిమాన సంఘాలు వెలిశాయి. మోహన్ బాబుతో సహా ఎంతోమంది నటులను సినీమాల్లో పరిచయం చేశారు. దర్శకులు కోడి రామకృష్ణ, రవిరాజా పినిశెట్టి, రేలంగి నరసింహారావు ఆయన శిష్యులే. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో కలిపి మొత్తంగా 150కి పైగా సినిమాలకు దర్శకత్వం వహించారు.
తెలుగులో తొలిసారిగా అన్ని కలర్ పేజీలతో ఉదయం దిన పత్రిక స్థాపించి, పత్రిక రంగంలో కూడా నంబర్ వన్ గా నిలపడ్డారు. సినిమా రంగం పై ప్రేమతో శివరంజని సినీ పత్రిక, పెట్టి సినిమా పత్రికల్లో నంబర్ వన్ పత్రికగా రికార్డు సృటించారు. రాజ్య సభ సభ్యుడిగా కేంద్ర సహాయ మంత్రిగా పదవి బాధ్యతలు నిర్వహించారు దాసరి. చిత్ర పరిశ్రమకు పెద్ద దిక్కుగా ఎన్నో సమస్యలను పరిష్కరించారు. తెలుగు సినిమా తల్లి మెడలొ ఆయనొక మణిహారం లాంటివారు. ఆయన జయంతి సందర్భంగా స్మృతంజలి ఘటిస్తుంది తెలుగు టైమ్స్.నెట్.













