బుచ్చిబాబుపై మరింత భారం
తీసిన మొదటి సినిమాకే జాతీయ అవార్డు రావడమంటే ఈ రోజుల్లో మామూలు విషయం కాదు. ఉప్పెన సినిమాకు జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా అవార్డు రావడంతో డైరెక్టర్ బుచ్చిబాబు ఆనందం మాటల్లో చెప్పేలా లేదు. ఈ అవార్డు వస్తుందని తన గురువు సుకుమార్, చిరంజీవి చెప్పినా కూడా అవార్డు వచ్చే వరకు నమ్మకం లేదని భావించి, అవార్డు వచ్చాక ఆ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు బుచ్చిబాబు. అలాంటి బుచ్చిబాబు, తన రెండో సినిమాను రామ్ చరణ్ తో చేయనున్న సంగతి తెలిసిందే. స్పోర్ట్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ సినిమాలో రామ్ చరణ్ ను బుచ్చిబాబు డిఫరెంట్ షేడ్స్ లో ప్రెజెంట్ చేయబోతున్నాడని ఇప్పటికే వార్తలొచ్చాయి. దానికి తోడు ఆర్ఆర్ఆర్, గేమ్ ఛేంజర్ లాంటి పాన్ ఇండియా సినిమాల తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలుంటాయి.
ఈ సినిమాను బుచ్చిబాబు జనవరి నుంచి సెట్స్ పైకి తీసుకెళ్లాలని ప్లాన చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈలోగా చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్ కూడా కంప్లీట్ చేస్తాడు. ఆ తర్వాత బుచ్చిబాబు సినిమా కోసం మేకోవర్ చేయాల్సి ఉంటుంది. ఉప్పెనకు జాతీయ అవార్డు రావడంతో ఇప్పుడు ఈ సినిమాకు బుచ్చిబాబుపై మరింత బాధ్యత పెరిగింది.
దానికి తోడు చరణ్ లాంటి హీరోని బుచ్చిబాబు ఎలా హ్యాండిల్ చేస్తాడా అనేది కూడా ఇప్పుడు అందరూ ఆలోచిస్తున్న విషయం. రెండో సినిమానే స్టార్ హీరోతో భారీ బడ్జెట్ తో అంటే ఈ అవకాశం దక్కడం బుచ్చిబాబు అదృష్టం అని చెప్పాలి. మొదటి సినిమాతో తన పనితనంతో మంచి మార్కులు వేయించుకున్న బుచ్చిబాబు, ఈ సినిమాతో తన టాలెంట్‌ను మరింత ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.













