ఆ విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్న దిల్‌రాజు!
ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విస్తరిస్తున్న తీరు చూస్తుంటే ప్రతి ఒక్కరిలోనూ ఆందోళన పెరిగిపోతోంది. ఇక మన దేశంలో పరిస్థితి కూడా దారుణంగానే ఉంది. వైరస్ భయంతో ప్రజలెవరూ బయటికి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. కొన్ని కోట్లు వెచ్చించి సినిమాలు తీసే నిర్మాతలకు ఇది పెద్ద షాక్ అనే చెప్పాలి. షూటింగ్ దశలో ఉన్న సినిమాలు, షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలు దేశవ్యాప్తంగా వందల్లో ఉన్నాయి. తెలుగులో చాలా సినిమాలు రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నాయి. వాటిలో పెద్ద సినిమాలు, చిన్న సినిమాలు కూడా ఉన్నాయి.
నాని, సుధీర్‌బాబు, నివేదా థామస్, అదితిరావ్ హైదరీ వంటి భారీ తారాగణంతో భారీ బడ్జెడ్‌తో తెరకెక్కించిన `వి` చిత్రం కూడా ఆ వరసలోనే ఉంది. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మార్చిలోనే విడుదల కావాల్సి ఉండగా లాక్డౌన్ ఈ సినిమా రిలీజ్‌ను అడ్డుకుంది. ఇక అప్పటి నుంచి థియేటర్స్ ఎప్పుడు తెరుచుకుంటాయి అని ఎదురుచూడడమే దిల్‌రాజు పనైపోయింది.ఈ సినిమా మీద దిల్‌రాజు ఎన్నో హోప్స్ పెట్టుకున్నాడు. ఎందుకంటే ఈ సంవత్సరం ఆరంభంలో విడుదలైన జాను సినిమా దిల్‌రాజు ఎంతో నష్టాన్నిమిగిల్చింది. `వి` సినిమా కాకుండా పవన్‌కల్యాణ్‌తో `వకీల్‌సాబ్`, తెలుగులో సూపర్‌హిట్ అయిన `హిట్` హిందీ రీమేక్ దిల్‌రాజు నిర్మాణంలోనే జరుగుతున్నాయి. అయితే ప్రస్తుతం కరోనా ఉధ్ధృతి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో షూటింగ్లో పాల్గొనేందుకు పెద్ద హీరోలెవరూ ముందుకు రావడం లేదు. ఏదైనా జనవరి తర్వాతే అంటున్నారు.
ఇక థియేటర్స్ ఇప్పట్లో ఓపెన్ అయ్యే అవకాశమే లేదు. ఒకవేళ ఓపెన్ అయినా జనం థియేటర్స్‌కి వచ్చి సినిమాలు చూసేంత సీన్ లేదు. ఈ పరిస్థితుల్లో రిలీజ్‌కి సిద్ధంగా ఉన్న `వి` చిత్రాన్ని ఏం చెయ్యాలి అనే ఆలోచన దిల్రాజును టెన్షన్‌కి గురి చేస్తోంది. ఈ సినిమాను ఓటీటీ ద్వారా విడుదల చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన కూడా చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే మూడు నెలలు ఆలస్యం కావడంతో ఓటీటీలో రిలీజ్ చెయ్యాలా? మరి కొంతకాలం వేచి చూడాలా? అనే విషయంలో ఒక క్లారిటీకి రాలేకపోతున్నాడని తెలుస్తోంది. దిల్రాజును ఇంతగా టెన్షన్‌కి గురి చేస్తున్న `వి` ఎప్పుడు రిలీజ్ అవుతుందో, ఏ ప్లాట్ఫామ్లో రిలీజ్ అవుతుందో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే.













