గేమ్ ఛేంజర్ గురించి క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు
ఆర్ఆర్ఆర్ తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా గేమ్ ఛేంజర్. తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా మొదలై ఎంతో కాలమవుతున్నప్పటికీ, మధ్యలో శంకర్ ఇండియన్2 సినిమాను కూడా చేయాల్సి రావడంతో గేమ్ ఛేంజర్ బాగా ఆలస్యమవుతూ వచ్చింది. దీంతో అసలు ఈ సినిమా ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? ఎప్పుడు రిలీజవుతుందని ఫ్యాన్స్ ఆందోళన చెందారు.
అయితే ఇప్పుడు మళ్లీ గేమ్ ఛేంజర్ ఓ ట్రాక్ లో పడ్డట్లు తెలుస్తోంది. యానిమల్ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసిన దిల్ రాజు, ఆ సినిమాకు మంచి ఓపెనింగ్స్ రావడంతో ప్రెస్ మీట్ పెట్టాడు. ఈ ప్రెస్మీట్ లో భాగంగా దిల్ రాజు గేమ్ ఛేంజర్ కు సంబంధించిన అప్డేట్స్ ఇచ్చాడు. గత పదిహేను రోజుల నుంచి గేమ్ ఛేంజర్ షూటింగ్ మైసూరులో జరుగుతున్నట్లు చెప్పిన దిల్ రాజు ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 80% పైగా పూర్తయినట్లు తెలిపాడు.
శంకర్ లాంటి డైరెక్టర్లు మేకింగ్ విషయంలో ఎక్కువ టైమ్ తీసుకుంటారని, తాము అనుకున్నది తెరపై వచ్చేవరకు రాజీపడరని, అందుకే అలాంటి వారికి డెడ్ లైన్ పెట్టి తొందర చేయకూడదని దిల్ రాజు చెప్పాడు. అంతే కాదు శంకర్ ఈ సినిమా కోసం ఉదయం 8 నుంచి రాత్రి పదిన్నర వరకు కష్టపడుతున్నాడని కూడా దిల్ రాజు తెలిపాడు. సినిమాను ఫాస్ట్ గా ఫినిష్ చేయడానికి టీమ్ మొత్తం ప్రయత్నిస్తుందని, షూటింగ్ కంప్లీట్ అయ్యాక పోస్ట్ ప్రొడక్షన్ కు ఎంత టైమ్ పడుతుందో చూసుకుని అప్పుడే రిలీజ్ డేట్ గురించి అనౌన్స్ చేస్తామని దిల్ రాజు వెల్లడించాడు.













