Dhandoraa: చావు పుట్టుకల మధ్య భావోద్వేగాన్ని తెలియజేసే ‘దండోరా’.. ఆకట్టుకుంటోన్న టీజర్
నేషనల్ అవార్డ్ గెలుచుకున్న చిత్రం ‘కలర్ ఫోటో’..బ్లాక్‌బస్టర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాలను నిర్మించి అందరి దృష్టిని ఆకర్షించిన లౌక్య ఎంటర్టైన్మెంట్స్ అధినేత రవీంద్ర బెనర్జీ ముప్పానేని రూపొందిస్తోన్న తాజా చిత్రం ‘దండోరా’ (Dhandoraa). శివాజీ, నవదీప్, నందు, రవికృష్ణ, మనికా చిక్కాల, మౌనికా రెడ్డి, బిందు మాధవి, రాధ్య, అదితి భావరాజు తదితరులు పాత్రధారులు. మురళీకాంత్ దర్శకత్వం వహిస్తున్నాడు. డిసెంబర్ 25న సినిమాను గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. సోమవారం ఈ సినిమా టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. అసలు టీజర్లో దర్శకుడు ఏం చెప్పాడు.. సినిమా ఎలా ఉండబోతుందనే విషయాల కోసం టీజర్‌ను గమనిస్తే..
ప్రేమికుడు ప్రేయసితో మాట్లాడుతూ ఆమెను ముద్దు పెట్టుకుంటానని అంటాడు. ‘ఏం చేద్దామనుకుంటున్నావ్.. పిచ్చిపిచ్చిగా ఉందా’ అంటూ ఆ అమ్మాయి రివర్స్ అయ్యే సీన్ కామెడీగా ఉంటుంది. అలా మొదలైన టీజర్లో నెక్ట్స్ రెండు పాత్రలను పరిచయం చేశాడు. ఓ పాత్ర సర్పంచ్.. ఈ పాత్రలో నవదీప్ నటించాడు. కూలింగ్ గ్లాసెస్ వేసుకుని అందరూ నమస్కారం పెడుతుంటే తను కూడా వారికి విష్ చేస్తూ దర్పంగా ఉండే పాత్రలో నవదీప్ కనిపించాడు. మరో పాత్రను పరిచయం చేశారు.. అందులో నటుడు శివాజీ కనిపించారు. ‘హైదరాబాద్ పో..అమెరికా పో.. యాడికైనా బో.. చస్తే ఇడీకే తేవాలె’ అని చెబుతుంటాడు.
*మేం తంతే లేవనోళ్లు.. అయినొచ్చి గొకితే లేస్తరని ఎందివయా ఇది’ అని వెటకారంగా నవదీప్ చెప్పే డైలాగ్.. పల్లెటూర్లు కొన్ని సీన్స్ కామెడీ టచ్‌తో సాగేలా ఉన్నాయి. మరో కొత్త పాత్ర ఎంట్రీ.. నందు. భార్య కూతుర్ని తిడుతుంటాడు. అలాగే బిందు మాధవి.. వేశ్య పాత్రలో కనిపించింది. ‘ఎవరు చెప్పారు నేను తప్పు చేస్తున్నానని.. వాళ్లు డబ్బులిస్తున్నారు..నేను వాళ్లకి సర్వీస్ చేస్తున్నానంటూ’ ఆమె శివాజీతో చెప్పిన డైలాగ్..సీన్స్‌తో పాత్రలను పరిచయం చేసిన దర్శకుడు
నెక్ట్స్ సీన్లో ఓ ఎమోషనల్ కోణాన్ని ఆవిష్కరించాడు. శవాన్ని మోస్తూ తీసుకెళుతుంటారు. అక్కడ ఓ పిల్లాడు అన్నా.. మా అవ్వను ఇంత దూరం ఎందుకు తీసుకెళుతున్నారని ప్రశ్నిస్తాడు.
‘నాలుగు పుస్తకాలు చదివి..లోకమంతా తెలిసినట్లు మాట్లాడొద్దు.. నీకు తెలియని లోకం ఇంకోటుందిరా’ అంటూ శివాజీ చెప్పే డైలాగ్ చూస్తుంటే సినిమాలో మరేదో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఉందని తెలుస్తోంది. పుట్టుకు..చావు మధ్య మనిషి ఎదుర్కొనే సంఘర్షణ, పరిస్థితులు, భావోద్వేగాలు గురించి చెప్పే కథాంశంతో ‘దండోరా’ రూపొందుతోందని స్పష్టమవుతోంది.
దండోరా సినిమా సామాజిక స్పృహను కలిగించే అంశంతో తెరకెక్కుతోంది. అగ్ర వర్ణాలకు చెందిన అమ్మాయిల ప్రేమించి పెళ్లి చేసుకున్నా, అగ్ర వర్ణాలకు ఎదురు తిరిగినా ఎలాంటి దౌర్జన్యకాండ జరుగుతున్నాయనే అంశాన్ని ఆధారంగా చేసుకుని దండోరా సినిమాను తెరకెక్కిస్తున్నారు. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో మన పురాతన ఆచారాలు, సాంప్రదాయాలను ఆవిష్కరిస్తూనే వ్యంగ్యం, చక్కటి హాస్యం, హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాల కలయికగా ఈ సినిమాను ఆవిష్కరిస్తున్నారు. టీజర్‌తో దర్శకుడు బలమైన అంశాన్ని చెప్పాలనకుంటున్నాడనే విషయం తెలుస్తుంది. సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి.
ఈ సినిమాలోని పాటలు టి సిరీస్ ద్వారా రిలీజ్ అవుతున్నాయి. అథర్వణ భద్రకాళి పిక్చర్స్ సినిమాను ఓవర్సీస్ రిలీజ్ చేస్తోంది.






