విశ్వక్ ప్రయత్నం ఫలిస్తుందా?
ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చి, వచ్చిన అతి తక్కువ కాలానికే యూత్‌లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న నటుల్లో విశ్వక్సేన్ ఒకడు. మొదటి సినిమా వెళ్లిపోమాకే లో సైలైంట్ గా కనిపించినా, తర్వాత అగ్రెసివ్ క్యారెక్టర్లతో యూత్‌లో మంచి కాక పుట్టించాడు. ఫలక్ నుమా దాస్ సినిమాతో డైరెక్టర్‌గా మారిన విశ్వక్, ఇప్పుడు మరోసారి స్వీయ దర్శకత్వంలో సినిమా తీశాడు.
ధమ్కీ సినిమాను తనే స్వయంగా నిర్మిస్తూ, దర్శకత్వం వహిస్తూ నటిస్తున్నాడు. ఈ సినిమా ఫలక్‌నుమా దాస్ లాగా రీమేక్ కూడా కాదు. ఈ సినిమా కోసం తనే సొంతంగా కథను కూడా రెడీ చేసుకున్నాడు. వాస్తవానికి ఈ సినిమా ఫిబ్రవరి 17నే రిలీజ్ కావాల్సింది కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడి ఆఖరికి, మార్చి 22న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. విశ్వక్ ఈ సినిమాను పాన్ ఇండియన్ రేంజ్లో రిలీజ్ చేయబోతుండటం విశేషం.
అయితే ఈ సినిమా పోస్ట్‌పోన్ అవడానికి కారణం స్క్రిప్టులో మార్పులు, రీషూట్లే అని తెలుస్తోంది. డిసెంబర్లో రిలీజైన ధమాకా స్టోరీతో ఈ సినిమాకు పోలికలు ఉండటంతో కథను మార్చి కొన్ని సీన్లు తీసేసి, మరికొన్ని కొత్త సీన్లను యాడ్ చేశాడట విశ్వక్. దీంతో ఇప్పుడు సినిమా మొత్తం మారినట్లు తెలుస్తోంది. అందుకే ముందు దానితో సంబంధం లేకుండా ఇప్పుడు మరో కొత్త ట్రైలర్‌ను కట్ చేయిస్తున్నాడట హీరో కమ్ డైరెక్టర్ విశ్వక్.
ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ నెల 17న జరగనుందని, ఈ ఈవెంట్‌కు విశ్వక్ ఫేవరెట్ హీరో ఎన్టీఆర్ చీఫ్ గెస్టుగా వస్తాడని సమాచారం. ఆయన చేతుల మీదుగానే కొత్త ట్రైలర్‌ను రిలీజ్ చేయించాలని విశ్వక్ చూస్తున్నాడట. విశ్వక్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాలో తనకు జోడీగా నివేదా పేతురాజ్ నటిస్తోంది.













