ఈ విషయంలో దేవీ కాస్త లేటే!
టాలీవుడ్ రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ ఇప్పుడైతే తన స్పీడ్ తగ్గించాడు కానీ ఒకప్పుడు చేసిన ప్రతీ సినిమా మ్యూజికల్ హిట్టే. ఇప్పుడైనా సరైన డైరెక్టర్, కథ పడితే నెక్ట్స్ లెవెల్ సంగీతం ఇస్తాడన్న సంగతి తెలిసిందే. పుష్ప2 నుంచి ఇప్పటికే రెండు సాంగ్స్ రిలీజ్ కాగా ఆ రెండూ ఇన్స్టంట్ ఛార్ట్బస్టర్లుగా నిలిచాయి. 25 ఏళ్లకు పైనుంచి టాలీవుడ్ లో సుదీర్ఘ ప్రయాణాన్ని కొనసాగిస్తున్న దేవీ శ్రీ ప్రసాద్ ఇప్పటికే విదేశాల్లో చెప్పుకోదగ్గ లైవ్ షో లు చాలానే చేశాడు. కానీ దేవీ ఇండియాలో ఇప్పటివరకు ఒక్క లైవ్ షో కూడా చేయకపోవడం ఆశ్చర్యం. దేవీ ఎప్పుడెప్పుడు ఇండియాలో లైవ్ కాన్సర్ట్ పెడతాడా అని ఎదురుచూసిన ఫ్యాన్స్ కోరిక తీరే టైమొచ్చింది.
దేవీ శ్రీ తన కెరీర్లో ఫస్ట్ టైమ్ ఇండియా టూర్ చేయబోతున్నాడు. ఈ నేపథ్యంలో అక్టోబర్ 19న హైదరాబాద్ లోని గచ్చిబౌలి స్టేడియంలో లైవ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నాడు. టికెట్ బుకింగ్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. వాస్తవానికి దేవీ ఈ కాన్సర్ట్ ఎప్పుడో చేయాల్సింది. గత పదేళ్లలో ఇళయరాజా మూడు సార్లు హైదరాబాద్ లో లైవ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. రెహమాన్ కూడా ఇచ్చాడు. త్వరలో యువన్ శంకర్ రాజా, హరీష్ జైరాజ్ కూడా ప్లాన్ చేస్తున్నారు. ఏదైతేనేం కాస్త లేట్ గా అయినా దేవీ హైదరాబాద్ లో పెర్ఫార్మ్ చేయబోతున్నాడు.













