నెక్ట్స్ లెవెల్ లో దేవర బిజినెస్
కొరటాల శివ దర్శకత్వంలో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న చిత్రం దేవర. రెండు భాగాలుగా రానున్న దేవర, మొదటి పార్ట్ అక్టోబర్ 10న రిలీజ్ కావాల్సింది కానీ ఇప్పుడు మేకర్స్ దేవరను కాస్త ప్రీ పోన్ చేసి సెప్టెంబర్ 27కే రిలీజ్ చేస్తుండటం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను ఆనందంలో ముంచెత్తుతుంది. వాస్తవానికైతే ఈ డేట్ కు పవన్ ఓజీ రావాల్సింది. కానీ ఇప్పుడు ఓజీ డ్రాపవడంతో దేవరకు సోలో రిలీజ్ దక్కుతుంది.
దేవరకు లాంగ్ వీకెండ్స్ తో పాటూ గాంధీ జయంతి, దసరా వరకు మంచి లాంగ్ రన్ దక్కనుంది. బ్లాక్ బస్టర్ టాక్ వస్తే వసూళ్లు, రికార్డులను ఆపడం ఎవరి వల్లా కాదు. ఇప్పటికే దేవరకు సంబంధించిన బిజినెస్ డీల్స్ అన్నీ పూర్తైనట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ను సితార ఎంటర్టైన్మెంట్స్ సొంతం చేసుకుంటే, నైజాం ఏరియాను దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేయనున్నట్లు తెలుస్తోంది.
దేవరను ఓవర్సీస్ లో ఎక్కువ స్క్రీన్స్ లో రిలీజ్ చేయాలని అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. హిందీ వెర్షన్ రైట్స్ ను అనిల్ తదానీ, కరణ్ జోహార్ సొంతం చేసుకోగా, ఓటీటీ రైట్స్ ను ఫ్యాన్సీ రేట్‌కు నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. శాటిలైట్ హక్కులను స్టార్ మా మంచి ధరకు సొంతం చేసుకుంది. మొత్తం మీద దేవరకు థియేట్రికల్, నాన్ థియేట్రికల్ కలిపి సుమారు రూ.500 కోట్ల వరకు బిజినెస్ జరిగిందంటున్నారు. అంటే టేబుల్ ప్రాఫిట్ తోనే దేవర థియేటర్లలోకి వస్తుందన్నమాట. ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు.













