ఎందరికో ఆదర్శవంతం దీపా రెడ్డి దొడ్ల.. ‘నేనూ సూపర్ వుమెన్’లో దొడ్ల డైరీ రూపకర్త..!
దొడ్ల డైరీ.. తెలుగు వారందరికీ సుపరిచితమైన పేరే ఇది. కానీ ఈ ఆలోచన వెనుక ఉన్న వ్యక్తి గురించి చాలా మందికి తెలియదు. ఆమె పేరు దీపా రెడ్డి దొడ్ల. డాక్టర్ ఎంఎస్ రెడ్డి, శ్యామా రెడ్డిల కుమార్తె అయిన దీప.. డెన్వర్ కొలరాడోలో పెరిగారు. అక్కడ చదువు పూర్తయిన తర్వాత ఇండియా వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు. దొడ్ల డైరీ స్థాపించడంలో భర్త సునీల్ దొడ్లకు ఎంతో సహకారం అందించారు. ఇప్పుడు ఈ డైరీ.. భారత్‌లోనే అతిపెద్ద డైరీల్లో ఒకటిగా ఎదిగింది. లక్షా 20 వేల మందికిపైగా రైతులు ఈ డైరీ ద్వారా జీవనోపాధి పొందుతున్నారు. అమెరికాలో చదువు, తెలుగు సంస్కృతి రెండూ తెలియడం వల్ల సరికొత్త ఆలోచనలతో కంపెనీని ఆమె చాలా అభివృద్ధి చేశారు. ఇప్పుడు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం ‘ఆహా’లో వస్తున్న ‘నేనూ సూపర్ వుమెన్’ కార్యక్రమంలో ఆమె ఏంజెల్‌గా జాయిన్ అయ్యారు. ఈ బిజినెస్ రియాలిటీ షోలో తెలుగు మహిళా ఆంత్రప్రెన్యూర్లకు దీప మెంటార్‌గా వ్యవహరిస్తారు. ఎంతోమందికి స్ఫూర్తిమంతంగా నిలిచిన దీప.. అమెరికన్ ఎన్నారైలు మన స్వదేశానికి ఎంతో సేవ చేయగలరు అనడానికి నిలువెత్తు నిదర్శనం.













