దర్శకరత్న దాసరి నారాయణరావు కన్నుమూత
ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణ రావు(75) కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న దాసరి హైదరాబాదులోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన మంగళవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఈ ఏడాది జనవరిలో ఆయన అన్నవాహిక, మూత్రపిండాలు, వూపిరితిత్తుల్లో సమస్యలతో అస్వస్థతకు గురయ్యారు. శస్త్రచికిత్స అనంతరం మళ్లీ ఇన్ఫెక్ష్న్ సోకడంతో దాసరి నాలుగురోజుల క్రితం మరోసారి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను చికిత్స నిమిత్తం కిమ్స్ తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ దాసరి కన్నుమూశారు.
తెలుగు సినీరంగంలో దిగ్గజ దర్శకునిగా, నటునిగా, రచయితగా ఖాతినార్జించిన దాసరి నారాయణరావు మృతితో టాలీవుడ్ దిగ్భ్రాంతికి గురైంది. కడసారి చూపు కోసం సినీ ప్రముఖులు ఆసుపత్రి వద్ద బారులు తీరారు.
ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో మే 4, 1942లో జన్మించిన దాసరి తాతా మనుమడు సినిమాతో దర్శకునిగా తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి సుప్రసిద్ధ నటీనటులకు హిట్ చిత్రాలనందించిన దాసరి రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేశారు. రాజ్యసభ సభ్యునిగా, కేంద్ర మంత్రిగా సేవలందించారు.













