ఘనంగా దాసరి అవార్డుల ప్రదానం
నాటి రోజుల్లో ఏడాదికి దాసరి నారాయణరావు 14 సినిమాలు చేశారు. అలాగే ఓ ఏడాదిలో ఏన్టీఆర్ 14, కృష్ణ 18 సినిమాల్లో నటించారు. కానీ నేటి అగ్ర హీరోలు, దర్శకులు రెండుమూడేళ్లకు ఓ సినిమా చేస్తూ పరిశ్రమను నాశనం చేస్తున్నారు అని అన్నారు ఏపీఎఫ్డీసీ చైర్మన్ అంబికాకృష్ణ. దాసరి మెమోరియల్ సిని అవార్డ్స్ 2019 ప్రదానోత్సవ వేడుక హైదరాబాద్లో జరిగింది. ఈ వేడుకకు అంబికాకృష్ణతో పాటు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య, తెలంగాణ ఎఫ్డీసీ చైర్మన్ పి.రామ్మోహన్రావు, దర్శకుల సంఘం అధ్యక్షుడు ఎన్.శంకర్, మా అధ్యక్షుడు నరేష్ ముఖ్య అతిథులుగా హాజరై గ్రహీతలకు అవార్డులను అందజేశారు.
దాసరి జీవన సాఫల్య పురస్కారాన్ని ఆర్ నారాయణమూర్తి, దాసరి ఎక్స్లెన్స్ అవార్డును పూరి జగన్నాథ్ తరపున ఆయన తనయుడు ఆకాష్ స్వీకరించారు. అలాగే దాసరి నారాయణరావు-దాసరి పద్మ మెమోరియల్ అవార్డును రాజశేఖర్-జీవిత అందుకున్నారు. ఉత్తమ తొలి చిత్ర దర్శకులుగా గౌతమ్ తిన్ననూరి (మళ్లీ రావా), వేణు ఊడుగుల (నీది నాది ఒకే కథ), వెంకటేష్ మహా (కేరాఫ్ కంచరపాలెం), శశికిరణ్ (గూఢాచారి) దాసరి అవార్డులను స్వీకరించారు. ఈ సందర్భంగా అంబికాకృష్ణ మాట్లాడుతూ ఎన్టీఆర్, ఏఎన్నార్, దాసరి స్ఫూర్తితో నవతరం హీరోలు, దర్శకులు ఎక్కువ సినిమాలు చేయాలని అన్నారు. సినీ పరిశ్రమలో కొత్తవాళ్లకు, పేద కళాకారులకు అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించినప్పుడే దాసరికి అసలైన నివాళి అని నారాయణమూర్తి తెలిపారు. ఈ కార్యక్రమంలో మురళీమోహన్, తమ్మారెడ్డి భరద్వాజ, తుమ్మలపల్లి రామసత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.













