అక్టోబరులో దాసరి తెలుగు సినీ అవార్డ్స్
దర్శకరత్న దాసరి నారాయణరావుగారు దాదాపు 40 ఏళ్ల పాటు తెలుగు చిత్రసీమకు ఎన్నో సేవలు చేశారు. ఆయనపై ఉన్న గౌరవంతోనైనా పరిశ్రమలోని నటీనటులంతా దాసరి అవార్డుల వేడుకకు హాజరవ్వాలి అన్నారు నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ. రాక్‌స్టార్ ఈవెంట్స్, కింగ్ మీడియా ఎంటర్టైన్మెంట్ ఆధ్వర్యంలో దాసరి తెలుగు సినీ అవార్డ్స్-2018 వేడుకను అక్టోబరు 26న హైదరాబాద్‌లో నిర్వహిస్తారు. ఈ కార్యక్రమ బ్రోచర్‌ను తమ్మారెడ్డి భరద్వాజ, రేలంగి నరసిహారావు ఆవిష్కరించారు. రేలంగి మాట్లాడుతూ అమెరికాలోని దాసరి అభిమానులైన కొందరు ఎన్నారైలు ఈ అవార్డుల వేడుకను నిర్వహించేందుకు ముందుకు వచ్చారు. దాసరి ఇప్పటికీ అభిమానుల మదిలో జీవించి ఉన్నారనటానికి ఇదే నిదర్శనం. కొంతమంది జూనియర్ ఆర్టిస్ట్‌లకు ఆర్థిక సహాయంతో పాటు విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వనున్నాం అన్నారు. దాసరిగారు తెలుగు సినిమాకు గాడ్‌ఫాదర్. అలాంటి వ్యక్తి పేరు మీదుగా అవార్డులను ఇవ్వడం సంతోషాన్నిస్తోంద న్నారు నిర్వాహకుల్లో ఒకరైన యండమూరి సాయి ప్రసాద్. ఈ కార్యక్రమంలో నరేష్, నవీన్, జయశంకర్ తదితరులు పాల్గొన్నారు.













