చిత్రం: అదే రొటీన్ కథతో ‘దాస్ కా ధమ్కీ’

తెలుగు టైమ్స్.నెట్ రేటింగ్: 2.25/5
నిర్మాణ సంస్థలు : వనమయి క్రియేషన్స్, విశ్వక్ సినిమాస్
తారాగణం: విశ్వక్ సేన్, నివేతా పేతురాజ్, అక్షర గౌడ్, రావు రమేష్, రోహిణి, హైపర్ ఆది, మహేష్ ఆచంట తదితరులు
కెమెరా: దినేశ్ కె బాబు, ఎడిటింగ్: అన్వర్ ఆలి, సంగీతం: లియోన్ జేంస్, నిర్మాత: కరాటే రాజు
దర్శకత్వం: విశ్వక్ సేన్
విడుదల తేదీ: 22.03.2023
విశ్వక్ సేన్ ఫ్లాప్ సినిమా పాగల్, తర్వాత వచ్చిన “అశోక వనంలో అర్జున కళ్యాణం, ఓరి దేవుడా” చిత్రాలు యావరేజ్ టాక్ వచ్చినా… మళ్ళీ “దాస్ కా ధమ్కీ” తో ట్రేండింగ్ లోకి వచ్చిన విశ్వక్ సేన్, నటుడిగా, రచయితగా, దర్శకుడిగా తన ట్యాలెంట్ చూపిస్తున్న ఈ హీరో కొంత గ్యాప్ తరవాత మళ్లీ మెగాఫోన్ పట్టుకోవడమే కాకుండా తానే నటించాడు. పైగా ఇది హోం ప్రొడక్షన్. స్క్రీన్ ప్లే, డైలాగ్, దర్శకత్వం అన్నీ తానై నడిపాడు. చాలా కాన్ఫిడెంట్ గా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాడు విశ్వక్ సేన్. మరి విశ్వక్ కాన్ఫిడెన్స్ ఆడియన్స్ ను ఏమేరకు ఇంప్రెస్ చేసిందో రివ్యూ లో చూద్దాం..!!
కథ:
కృష్ణదాస్ (విశ్వక్ సేన్) ఒక స్టార్ హోటల్లో వెయిటర్. కానీ తనకి మాత్రం లైఫ్ లో పెద్ద స్థాయిలో సెట్ అవ్వాలని ఎన్నో డ్రీమ్స్ పెట్టుకుంటాడు. అదే హోటల్లో తన తోటి రూం మేట్స్ వెయిటర్ గా ఒకరు (మహేశ్), వాలెట్ పార్కింగులో ఒకరు (హైపర్ ఆది) పని చేస్తుంటారు. పేదరికం వల్ల పడే బాధల నుంచి బ్రేక్ తీసుకోవాలనే యావలో కృష్ణదాస్ డబ్బున్నవాడిగా బిల్డప్పివ్వాలనుకుంటాడు. పర్యవసానంగా కీర్తి (నివేతా పేతురాజ్) అతని ప్రేమలో పడుతుంది. తనని ఒక పెద్ద కంపెనీకి సీయీవోగా భావించిన ఆమె డేటింగ్ కూడా మొదలుపెడుతుంది. అలాగే మరో పక్క ఎస్ ఆర్ ఫార్మా చైర్మన్ గా డాక్టర్ సంజయ్ రుద్ర(మరో విశ్వక్ సేన్) తన ప్రయోగంతో ప్రపంచంలో క్యాన్సర్ అనేది లేకుండా చేయాలని దృఢ సంకల్పంతో ఉంటాడు. సీయీవో సంజయ్ రోడ్ యాక్సిడెంటులో చనిపోతే ఆ స్థానంలో నటించమని అడుగుతాడు సంజయ్ బాబాయ్ (రావు రమేష్). మరి ఈ కృష్ణదాస్, సీయీవో సంజయ్ రుద్ర ఇద్దరూ ఒకరికి ఒకరు లింక్ ఉంటుందా? లేక వేరే వేరేనా? కథలో సంజయ్ రుద్ర కి ఏమవుతుంది? తన లక్ష్యాన్ని చేరుకున్నాడా లేదా? ఎవరితో లింక్ ఉంటుంది? ఇలా అనేక ప్రశ్నలకి సమాధానం తెలియాలి అంటే ఈ సినిమా చూడాల్సిందే. ఆ తర్వాత ఏమౌతుందనే మిగతా కథ.
నటీనటుల హావభావాలు:
విశ్వక్ సేన్ మాత్రం డ్యుయల్ షేడ్ లో నటించి మెప్పించే ఎంతో ప్రయత్నం చేసాడు. ఇది వరకు కూడా ఇలాంటి యూత్ ఫుల్ అగ్రెసివ్ రోల్స్ లో కనిపించిన తాను ఓ చైర్మన్ రోల్ లో అయితే మంచి సెటిల్డ్ పెర్ఫామెన్స్ ని కనబరిచాడు. అలాగే రెండు షేడ్స్ లో కూడా మంచి వేరియేషన్స్ ని ఎమోషన్స్ ని బాగా చేసాడు. అయినా సరే అతనికి కామెడీయే బెటర్ గా సెట్టవుతుందని ఈ చిత్రం చూస్తే అర్ధమౌతుంది. ఈ సినిమాకి ప్రధానమైన ఆకర్షణ హైపర్ ఆది, మహేశ్ ఆచంటలు . వాళ్లిద్దరూ లేకపోతే ఈ చిత్రాన్ని భరించడం బరువయ్యేది. వీళ్ల ట్రాకుల్లోని పంచ్ డైలాగ్స్ హైపర్ ఆదీయే రాసాడా, లేక టైటిల్స్ లో పేర్కొన్నట్టు విశ్వక్సేనే రాసాడా తెలీదు. కానీ హాస్యం మాత్రం పండింది. కానీ సెకండాఫులో అంతా తేలిపోయి మళ్లీ చివర్లో కాస్త నవ్వులు విరిసాయి. ఈ కామెడీ జంటని ఇంకాస్త వాడుకుని ఉంటే బాగుండేదేమో? విశ్వక్ సేన్-రోహిణి మధ్యలోని ట్రాకైతే నీరసానికి పరాకాష్ట. నివేతాపేతురాజ్ గ్లామరస్ గా ఉంది. తెరమీద తక్కువసేపే ఉన్నా తన ఉనికి బలంగా చాటుకుంది. రావు రమేష్, పృథ్వీ తదితరులు తమ పాత్రలకు సంపూర్ణ న్యాయం చేకూర్చారు.
సాంకేతికవర్గం పనితీరు:
ఈ చిత్రాన్ని విశ్వక్ సేన్ డైరెక్షన్ చేసిన సంగతి తెలిసిందే. ఇది వరకు కూడా తాను డైరెక్టర్ గా చేసాడు కానీ ఈ సినిమాకి మాత్రం పూర్తి స్థాయిలో ఆకట్టుకునే రేంజ్ లో తన పనితనం లేదనే చెప్పాలి. చిత్రం చాలా సాగతీత పైగా స్క్రీన్ ప్లేలోనూ, సీన్ కన్సీవింగ్ లోనూ చాలా లోపాలున్నాయి. మరింత కన్విన్సింగ్ గా, గ్రిప్పింగ్ గా మలచగలిగే అవకాశమున్నా ఆ పని చెయ్యలేదు. సంజయ్ రుద్రా పాత్ర ప్రవేశమైనప్పటి నుంచి నీరసం, చిరాకు కలుగుతాయి. సెకండాఫ్ లో ఇంకా జాగ్రత్తగా హ్యాండిల్ చేసి ఉంటే బాగుండు. ట్విస్ట్ లు చాలా వరకు ముందే తెలిసిపోయేలా ఉంటాయి పైగా ఇలాంటివి ఎక్కువ ఉండడంతో ఆడియెన్స్ అంతగా థ్రిల్ అవ్వకపోవచ్చు. విశ్వక్ అయితే తన సాధ్యమైనంత వరకు ట్రై చేసాడు కానీ అవి కంప్లీట్ గా ఎంటర్టైన్ చేయలేదు. తనలోని అపరిచితుడైన నటుడుని పరిచయం చేసుకోవాలనే ఆతృతతో సెకండాఫులో సంజయ్ పాత్రని అవకతవకగా రాసుకోవడం జరిగింది. అలాగే లియోన్ జేమ్స్ సంగీతం సినిమాలో ట్రీట్ ఇస్తుంది. అలాగే దినేష్ కే బాబు సినిమాటోగ్రఫీ బాగుంది. కానీ ఎడిటింగ్ మాత్రం ఇంకా బెటర్ గా చేయాల్సింది. కాస్ట్యూమ్స్, డైలాగ్స్ టీం వర్క్స్ బాగున్నాయి. సినిమాలో పాత్రలు డిమాండ్ మేరకు కావాల్సిన అన్ని హంగుల్లో మంచి నిర్మాణ విలువలు కనిపిస్తాయి.
విశ్లేషణ:
ఒకే టికెట్టు మీద రెండు సినిమాలు చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. ఒకనాటి రాముడు భీముడు, మొన్నటి రౌడీ అల్లుడు, దొంగ మొగుడు, నిన్న వచ్చిన బిల్లా ఇటీవలే వచ్చిన ధమాకా, అమిగోస్..ఈ చిత్రాలన్నీ మళ్ళీ గుర్తుకొస్తాయి. ప్లాట్ పాతదైనా పర్వాలేదు. కథనం పకడ్బందీగా ఉంటే ఏ లోటు ఉండదు కానీ అలా లేదు. అలాగే అక్కడక్కడా మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కానీ కథలో ఎలాంటి కొత్తదనం ఉండదు పైగా చాలా ఇంప్రెస్ చెయ్యని ట్విస్ట్ లు బోర్ అనిపిస్తాయి. సినిమాను కాస్త తక్కువ అంచనాలు పెట్టుకొని ఈ పండుగకి లేదా వారాంతానికి ఒక్కసారి చూడొచ్చు.