Balakrishna: చరిత్ర సృష్టించడం మాతోనే సాధ్యం డల్లాస్ వేడుకల్లో నందమూరి బాలకృష్ణ

నందమూరి బాలకృష్ణ(Balakrishna) తాజాగా నటించిన డాకు మహారాజ్(Daku Maharaj) సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అమెరికాలోని డల్లాస్‌పురంలో భారీ ఎత్తున జరిగింది. తెలుగువాళ్ళు పెద్ద సంఖ్యలో ఉన్న ఈ నగరంలో బాలకృష్ణ అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో ఉండటంతో ఈ వేడుక జరిగిన ప్రాంతమంతా బాలయ్య నినాదాలతో మారుమ్రోగిపోయింది.
నందమూరి అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్న ఆ ఈవెంట్‌లో బాలకృష్ణ మాట్లాడుతూ తాను వరుసగా సినిమాలు చేస్తూ ఉంటానని, వచ్చిన విజయాలు తనకు మరింత ఉత్సాహంను అందిస్తున్నామని అన్నారు. గతంలో ఒకే ఏడాది ఏడు హిట్స్ అందుకున్న దాఖలాలు ఉన్నాయి అన్నారు. డాకు మహారాజ్ సినిమా తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలవుతుంది బాలకృష్ణ ప్రకటించారు. నేను చలనచిత్ర పరిశ్రమకు వచ్చి 50 ఏళ్లు పూర్తయింది. ఇది ప్రపంచ రికార్డు. ఇప్పటివరకు హీరోగా ఎవరూ 50ఏళ్లు రాణించలేకపోయారు. ఇండస్ట్రీలోని కొందరు హీరోలు కొంతకాలం కథానాయకులుగా చేసి.. తర్వాత క్యారెక్టర్ రోల్స్‌కు పరిమితమయ్యారు. కానీ, హీరోగా 50 ఏళ్లు పూర్తి చేసుకున్న ఘనత నాకు దక్కింది. దీనికి ఆ దేవుడి ఆశీస్సులతో పాటు తల్లిదండ్రులు, ప్రేక్షకుల దీవెనలే కారణం. నందమూరి తారక రామారావు సూర్యుడితో సమానం. ఎలాంటి సినిమాల్లోనైనా తన పాత్రకు జీవం పోసేవారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయనే నాకు స్ఫూర్తి. ఆయన్ని అనుసరిస్తూ నన్ను నేను సాన పెట్టుకొని వజ్రంలా తయారయ్యాను. నాకు ఆధ్యాత్మిక భావం ఎక్కువ. ఆ భగవంతుడే నన్ను నడిపిస్తాడని ముందుకుపోతుంటా. నేను సినిమాల్లోకి వచ్చిన మొదటిరోజు మా నాన్నగారు బొట్టు పెట్టి దీవించారు.
అప్పటినుంచి ఎన్నో సినిమాలు చేస్తూ వస్తున్నాను. ఎన్నో బ్యానర్‌లలో నటించాను. ఫస్ట్ ఇండియన్ సోషియో ఫాంటసీగా ఆదిత్య 369 రూపొందింది. త్వరలోనే ఆదిత్య 369కు సీక్వెల్ కూడా చేయనున్నా’’. చరిత్ర సృష్టించాలన్నా మేమే.. దాన్ని తిరగరాయాలన్నా మేమే.. మళ్లీ అలానే సినిమాలు చేస్తాను. ఇటీవల నేను నటించిన మూడు సినిమాలూ సూపర్ హిట్‌గా నిలిచాయి. ఇప్పుడు రెండో ఇన్నింగ్స్ ప్రారంభమైంది. అందరి సహాయసహకారాల వల్లే నేను ఈ స్థాయికి వచ్చాను. ‘ఆదిత్య 369’లో ఓ పాత్ర నుంచి పుట్టిన కథే ‘డాకు మహారాజ్’. మంచి సందేశాత్మక సినిమాలు ఇవ్వాల్సిన బాధ్యత నాపై ఉంది. సినిమా అంటే సమష్టి కృషి. నేను ఏ సినిమా చేసినా.. నా అభిమానులను దృష్టిలో పెట్టుకుంటాను. ఓటీటీలు, సోషల్ మీడియాల్లో పోటీతత్వం పెరిగింది. అలాంటి వాటన్నింటికీ సవాలుగా నిలబడిరది బాలకృష్ణ మాత్రమే. తెలుగు సినిమాకు పోటీ లేదు. మనం ప్రపంచస్థాయికి ఎదిగాం’’ అని అన్నారు. వయసు పెరుగుతున్న కొద్దీ సినిమాల గురించి మరింత అవగాహనతో వ్యవహరిస్తున్నట్లు పేర్కొన్నారు. అభిమానులు, ప్రేక్షకులు మరింత అభిమానించే విధంగా సినిమాలు చేస్తానని హామీ ఇచ్చారు.
అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ విజయాలను సొంతం చేసుకుని హ్యాట్రిక్ నమోదు చేసిన బాలకృష్ణ తాజాగా బాబీ దర్శకత్వంలో రూపొందిన డాకు మహారాజ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. జనవరి 12వ తారీకున సంక్రాంతి కానుకగా రాబోతున్న ఈ సినిమా భారీ ఈవెంట్‌ను అమెరికాలో చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది. నందమూరి అభిమానులు అనుకున్నట్లుగానే భారీ ఎత్తున హాజరు అయ్యారు. సినిమా ఈవెంట్‌కి సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
బాబీ దర్శకత్వంలో నాగ వంశీ సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌లో నిర్మించిన డాకు మహారాజ్ సినిమాలో బాలకృష్ణ డ్యూయెల్ రోల్‌లో కనిపించబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. బాల కృష్ణ పాత్ర విభిన్న కోణాలను కలిగి ఉంది. విభిన్న రూపాలలో ఆయన సరికొత్తగా కనిపిస్తున్నారు. మొదట డాకు మహారాజ్‌గా, తరువాత ఒక చిన్నారిని రక్షించే నానాజీగా విభిన్న కోణాలలో ఆయన పాత్ర ఉండనుంది. దర్శకుడు బాబీ కొల్లి బాలకృష్ణను మునుపెన్నడూ చూడని అవతార్‌లో అభిమానులు, ప్రేక్షకులు మెచ్చేలా సరికొత్తగా చూపిస్తున్నారు. డాకు మహారాజ్ ని ఢీ కొట్టే బలమైన ప్రతినాయకుడి పాత్రలో బాబీ డియోల్ నటించారు.
ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందిని చౌదరి, ఊర్వశి రౌతేలా కథానాయికలుగా నటించారు. విజయ్ కార్తీక్ కన్నన్ కెమెరా పనితనం ఓ రేంజ్‌లో ఉంది. కొన్ని విజువల్స్ అయితే హాలీవుడ్ సినిమాలను గుర్తుకు తెస్తున్నాయి. ఈ సినిమాకు తమన్ సంగీతం అందించారు. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటించగా ఊర్వశి రౌతేలా, శ్రద్ధా శ్రీనాథ్‌లు కీలక పాత్రలో కనిపించబోతున్నారు. బాలీవుడ్ స్టార్ నటుడు బాబీ డియోల్ ఈ సినిమాలో ముఖ్య పాత్రలో నటించాడు. సంక్రాంతికి బాలకృష్ణ మరో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటారని ఫ్యాన్స్ చాలా నమ్మకంగా ఉన్నారు. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకునే విధంగా డాకు మహారాజ్ సినిమా ట్రైలర్ ఉందంటూ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. నాయకులు రవి పొట్లూరి, సునీల్ పంట్ర, కిరణ్ చౌదరి తదితరులు కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు.