Daku Maharaj: డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్
తిరుమల(Tirumala) వేంకటేశ్వర స్వామి వారి పాదాల చెంత బుధవారం రాత్రి ఘోర విషాదం చోటు చేసుకుంది. అనూహ్యంగా జరిగిన తొక్కిసలాటలో ఏకంగా ఆరుగురు భక్తులు కన్ను మూశారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. దీంతో యావత్తు భక్త లోకం శోక సంద్రంలో మునిగిపోయింది. ఇలాంటి విషాద సమయంలో సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎలా నిర్వహిస్తాం అని ఆ ఘటనకు సంతాప సూచకంగా బాలకృష్ణ(Balakrishna) చిత్ర నిర్మాతలు కీలక నిర్ణయం తీసుకున్నారు.
గురువారం అనంతరపురం వేదికగా జరగాల్సిన డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్(Daku Maharaj Pre Release event) ను క్యాన్సిల్ చేస్తున్నట్టు ప్రకటించారు. రాజకీయాల్లో రాణిస్తున్న బాలయ్య(Balayya), సినిమాల్లో కూడా మంచి ఊపు మీదున్నాడు. సంక్రాంతికి రిలీజ్ కానున్న డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను రాయలసీమలోని అనంతపురంలో చేయాలని ప్లాన్ చేశారు.
దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తయ్యాయి. ఈ ఈవెంట్ కు బాలయ్య అల్లుడు, ఏపీ ఐటీ మినిస్టర్ నారా లోకేష్(Nara Lokesh) చీఫ్ గెస్టుగా రావాల్సింది. కానీ తిరుపతిలో జరిగిన తొక్కిసలాట వల్ల ఏపీలో విషాద ఛాయలు అలముకున్నాయి. అందుకే ఈ విషాద ఘటనకు సంతాపం తెలుపుతూ బాలయ్య తన సినీ వేడుకను రద్దు చేశారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇక డాకు మహారాజ్ కు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉండే అవకాశాలు పెద్దగా కనిపించడం లేదు.













