సరైన టైమ్‌లో లీడర్ రీరిలీజ్
టాలీవుడ్ లో ప్రస్తుతం రీరిలీజ్ ల ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. రిలీజ్ టైమ్ లో డిజాస్టర్లనిపించుకున్న సినిమాలు సైతం ఇప్పుడు కలెక్షన్ల వర్షాన్ని కురిపిస్తున్నాయి. ఆరెంజ్ సినిమా రీరిలీజ్ విషయంలో ఏం జరిగిందో కళ్లారా చూశాం. ఇక బ్లాక్ బస్టర్ల గురించైతే చెప్పనక్కర్లేదు. పోకిరి నుంచి మన్మథుడు వరకు అన్నీ మంచి కలెక్షన్లను సాధించినవే. ఇక వచ్చేవారం కల్ట్ మూవీ 7జి బృందావన్ కాలనీ రీరిలీజ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రీసెంట్గా ఈ రీరిలీజ్‌ల ట్రెండ్‌లోకి రానా డెబ్యూ సినిమా లీడర్ చేరబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఫిబ్రవరిలో ఈ సినిమాను 4కె లో రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. 13ఏళ్ల క్రితం రిలీజైన ఈ సినిమాను సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తీశాడు.
రాష్ట్ర ముఖ్యమంత్రి చనిపోతే ఆ ఛైర్ కోసం కొడుకు చుట్టూ ఉన్న పద్మవ్యూహాన్ని తప్పించుకుని అతనెలా సీఎం అయ్యాడనే పాయింట్ మీద ఈ సినిమాను రూపొందించాడు కమ్ముల. వైఎస్ మరణాన్ని ఆధారంగా చేసుకుని ఈ సినిమా తీశారని కూడా అప్పట్లో టాక్ వినిపించింది. త్వరలో ఎలక్షన్లు జరగనున్న నేపథ్యంలో ఈ సినిమాను రీరిలీజ్ చేయబోతుండటం ఆసక్తికరంగా మారింది. రూలింగ్ పార్టీకి వ్యతిరేకంగా ప్రతినిథి2తో నారా రోహిత్ వస్తుంటే, ఫిబ్రవరిలో మహి రాఘవ జగన్ బయోపిక్ యాత్ర2తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ రెండు సినిమాల మధ్య లీడర్ రీరిలీజ్ అవడం ఇంట్రెస్టింగ్‌గానే ఉంది. మరి తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాకు ఎలా బ్రహ్మరథం పడతారో చూడాలి.













