తమన్నాకు అరుదైన గౌరవం
దాదా సాహెబ్ ఫాల్కే ఫౌండేషన్ ఇండస్ట్రీకి సంబంధించిన దర్శకులు, నటులు, నిర్మాతల ప్రతిభని గుర్తించి వారిని దాదా సాహెబ్ ఫాల్కే ఎక్స్‌లెన్స్ అవార్డు తో సత్కరించాలనుకుంటోంది. ఇప్పటికే పద్మావత్ చిత్రంలో అల్లావుద్దీన్ ఖిల్జీ పాత్రలో విలక్షణ నటనతో ఆడియెన్స్ ను కట్టిపడేసిన రణ్‌వీర్‌ని దాదా సాహెబ్ ఫాల్కే ఎక్స్‌లెన్స్ అవార్డు కి ఎంపిక చేసినట్లు అవార్డు కమిటీ సభ్యులు ప్రకటించారు. తాజాగా తమన్నా కూడా ఈ అరుదైన అవకాశాన్ని దక్కించుకుంది. బాహుబలిలో అవంతిక పాత్రలో అద్భుతంగా నటించిన తమన్నా ఈ అవార్డుకు ఎంపికైంది. ఏప్రిల్ 21న ముంబైలో జరుగనున్న కార్యక్రమంలో రణ్ వీర్, తమన్నా ఈ అవార్డులను అందుకోనున్నారు. దాదా సాహెబ్ ఫాల్కే భారతీయ సినిమాను గొప్ప స్థాయికి తీసుకెళ్లారని, దాదా సాహెబ్ ఫాల్కే ఫౌండేషన్ తనను ఈ అవార్డుకు ఎంపిక చేయడం ఎంతో అరుదైన గౌరవంగా భావిస్తున్నట్లు తమన్నా చెప్పింది. తమన్నా ప్రస్తుతం తెలుగులో నా నువ్వే, క్వీన్ రీమేక్ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.













